Lands Soon Takes off Early : విమాన ప్రయాణం అనే పేరు వినగానే, సుదూర ప్రాంతాలు, ఆకాశంలో ఎగురుతున్న పెద్ద విమానాల చిత్రం మన మనసులో మెదులుతుంది కదా. కానీ ప్రపంచంలోనే అతి తక్కువ దూరం ప్రయాణించే విమానం ఎంతసేపు ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక గంట? కాదు కాదు కొన్ని నిమిషాలు ఉండవచ్చు అనుకుంటున్నారా? కానీ ఇప్పుడు చెప్పబోయేది మీరు తెలుసుకున్న తర్వాత చాలా షాక్ అవుతారు. నిజానికి, ప్రపంచంలో అలాంటి విమాన పర్యటన కూడా ఉంది. అవును నిజమే. దీనిలో విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే ల్యాండ్ అవుతుంది. ఏంటి సెకన్ లలోనే ప్రయాణమా అనుకుంటున్నారా? మీరు చదివింది ఖచ్చితంగా నిజమే, జస్ట్ కొన్ని సెకన్లలోనే మీ జర్నీ కంప్లీట్ అవుతుంది. దిగేస్తారు. పూర్తి వివరాల్లోకి వెళదామా?
స్కాట్లాండ్‌లోని ఓర్క్నీ దీవులలో ఉన్న వెస్ట్‌రే, పాపా వెస్ట్‌రే దీవుల మధ్య విమానం గురించి మనం మాట్లాడుతున్నాము. ఇది సాధారణ విమానం కాదు, కానీ ప్రపంచంలోనే అతి తక్కువ వాణిజ్య విమానంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు అయింది. ఈ ప్రయాణం దూరం కేవలం 2.7 కిలోమీటర్లు. విమానం దీన్ని పూర్తి చేయడానికి సగటున 80 సెకన్లు పడుతుంది. గాలి దిశ అనుకూలంగా ఉంటే కొన్నిసార్లు ఈ సమయాన్ని 53 సెకన్లలోనే జర్నీ పూర్తి అవుతుంది.
కేవలం 80 సెకన్ల ప్రయాణం
సాధారణంగా విమాన ప్రయాణాలు గంటల తరబడి జరుగుతాయి. కానీ వెస్ట్‌రే, పాపా వెస్ట్‌రే మధ్య ఈ విమానం కేవలం 80 సెకన్లలో పూర్తవుతుంది. అవును, మీరు సరిగ్గా చదివారు. ఒకటిన్నర నిమిషాల కన్నా తక్కువ అన్నమాట. కొన్ని సందర్భాల్లో ఇది 53 సెకన్లలో కూడా పూర్తవుతుంది. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో కూడా నమోదు అయింది.
ఇంత చిన్న ప్రయాణం ఎందుకు?
ఇంత తక్కువ దూరానికి విమానం ఎందుకు ఉపయోగిస్తున్నారు అని కూడా మీకు అనుమానం రావచ్చు. వాస్తవానికి, ఈ రెండు దీవుల మధ్య రోడ్డు, వంతెన లేవు. సముద్రం పడవలో ప్రయాణించడం కష్టంగా ఉంటుంది. అందువల్ల, ఈ విమాన సేవ స్థానిక ప్రజలకు, అవసరమైన సేవలకు (వైద్యులు, ఉపాధ్యాయులు వంటివారు) జీవనాధారం లాంటిది.
చిన్న విమానం, ప్రత్యేకమైన అనుభవం
ఈ పర్యటన కోసం, ఒక చిన్న బ్రిటన్-నార్మన్ BN2B-26 ఐలాండర్ విమానం ఉపయోగిస్తున్నారు. ఇందులో దాదాపు 8-10 మంది ప్రయాణికులు కూర్చుంటారు. అంత చిన్నది విమానం. ప్రయాణీకులు కూడా దానిలో కూర్చుని పైలట్ విమానాన్ని ఎగరవేయడాన్ని చూడవచ్చు. ఇది ఈ అనుభవాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తుంది. ఈ ప్రత్యేకమైన విమానం స్థానికులకు సౌకర్యాన్ని అందించడమే కాకుండా, ఈ అద్భుతమైన, అతి తక్కువ విమాన ప్రయాణాన్ని అనుభవించాలనుకునే ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది.