తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు క్రీడలు, యువత శాఖ మంత్రి ఉదయనిధి సనాతన ధర్మంపై విద్వేషపూరితంగా, అవమానకరంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ వంటిదని.. ఆ ధర్మాన్ని నిర్మూలించాలని, నాశనం చేయాలని వ్యాఖ్యలు చేయడం దుర్మార్గామని లక్ష్మణ్ తెలిపారు. మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులతో పోల్చి యావత్ హిందువులను అవమానపర్చారు. కాంగ్రెస్ లాంటి కొన్ని పార్టీలు కూడా ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తూ 100 కోట్ల మంది హిందువులను అవమానపర్చుతున్నాయన్నారు.
వన్ నేషన్-వన్ ఎలక్షన్ గురించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనవసర విమర్శలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే సనాతన ధర్మాన్ని కించపర్చే వారి గురించి మాత్రం ఎందుకు సమర్థిస్తున్నట్లు? కాంగ్రెస్ వ్యవహరిస్తున్న వైఖరి పట్ల సనాతన ధర్మాన్ని విశ్వసించే హిందువులు, ప్రజలు ఆలోచించుకోవాలి. రాజకీయాలకు అతీతంగా బుద్ధి చెప్పాలి. కుహనా లౌకకవాదం ముసుగులో కాంగ్రెస్ చేసే రాజకీయాలకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని లక్ష్మణ్ అన్నారు.
-లక్ష్మణ్ ప్రెస్ మీట్ లోని కీలక అంశాలు ఇవీ
గజినీ నుంచి మొదలుకొని మొగలులు, తురుష్కులు, అక్బర్, ఔరంగజేబు, నిజాంలు, మతోన్మాద మజ్లిస్ పార్టీలు, రాజకీయ రజాకార్ల వారసులు అనేక సందర్భాల్లో హిందూ ధర్మంపై దాడికి ప్రయత్నించారు. ఆలయాలను, మందిరాలపై దాడికి పాల్పడ్డారు. దేశంపై, ధర్మంపై చేసిన దాడులు ఆనాటి నుంచి జరుగుతున్నవే. అయినా సనాతన ధర్మం ఎక్కడా చెక్కుచెదరకుండా కాపాడుకున్నాం.
స్టాలిన్ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాం.. తమిళనాడు ప్రభుత్వ అధికారిక చిహ్నం(ఎంబ్లమ్)లోనే ఆలయం ముద్రణ ఉంటుంది. మీకు దమ్ముంటే ఆ చిహ్నాన్ని తీసేయండి.. అప్పుడు సనాతన ధర్మాన్ని విశ్వసించే వారంతా మీకు సరైన బుద్ధి చెబుతారు.
మందిరాలు, ఆలయాల నుంచి వచ్చే ఆదాయంతో ఖజానా నింపుకునే మీరు.. హిందూ ధర్మం గురించి నీచంగా వ్యాఖ్యలు చేయడం దారుణం. సనాతన ధర్మం ఆచరించే వారి ఓట్లు మీకు అక్కర్లేవా? స్టాలిన్ సమాధానం చెప్పాలి.
ప్రతిపక్ష పార్టీల కూటమిలో డీఎంకే ముఖ్యమైన భాగస్వామి, కాంగ్రెస్‌తో ఆ పార్టీకి సుదీర్ఘకాలం నుంచి మైత్రి ఉంది. మరి సనాతన ధర్మంపై మీ కూటమి పార్టీల్లో నాయకుడు వ్యంగంగా, నీచంగా మాట్లాడితే.. కనీసం ఎందుకు నోరు మెదపలేదో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.
హిందువులపై, హిందూ సనాతన ధర్మంపై విషం చిమ్ముతూ, 100 కోట్లకు పైగా హిందువుల మనోభావాలను కించపర్చుతున్నారు. సూడో సెక్యులర్ ముసుగులో హిందూ వ్యతిరేకత కాంగ్రెస్ నరనరాన నాటుకుపోయింది.
15 నిమిషాలు సమయమిస్తే దేశంలో హిందువులను లేకుండా చేస్తానన్న ఓవైసీతో అంటకాగుతున్న పార్టీ కాంగ్రెస్.
అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణాన్ని కోట్లాది మంది హిందువులు కోరుకుంటే.. ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ.
మైనారిటీ సంతుష్టీకరణ విధానాల కోసం, కేవలం ముస్లంల ఓట్ల కోసం హిందువులను అవమానపర్చడం, అవహేళన చేయడం దుర్మార్గం.
హిందూధర్మం కోసం పాటుపడుతున్న భజరంగ్ దళ్ ను నిషేధిస్తామంటూ.. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి హింసకు పాల్పడే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో కాంగ్రెస్ జతకట్టడం వెనుక ఆంతర్యమేంటి?
టెర్రరిజాన్ని కట్టడి చేయాలని ప్రపంచ దేశాలు భావిస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం సాఫ్రాన్ టెర్రరిజం అంటూ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తోంది. కాంగ్రెస్ విషపూరిత చర్యలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
ముంబైలో మారణహోమం, పార్లమెంట్ పై దాడి, పుల్వామా దాడి, హైదరాబాద్ లోని గోకుల్ చాట్, లుంబిని పార్కుల్లో పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాద సంస్థలకు వంతపాడే కాంగ్రెస్ హిందూ టెర్రరిజం, సాఫ్రాన్ టెర్రరిజం అంటూ దుమ్మెత్తిపోయడాన్ని ప్రజలు సహించరు.
సర్వేజనో సుఖినో భవంతు అని విశ్వసిస్తూ, సబ్ కా సాత్, సబ్ కా వికాస్ లక్ష్యంగా సుపరిపాలన అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ గారిపై, సనాతన ధర్మాన్ని విశ్వసించే వ్యక్తులపై, ధర్మంపై అవమానకరంగా వ్యాఖ్యలు చేసే వారికి రోజులు దగ్గరపడ్డాయి.
సనాతన ధర్మంపై విషం కక్కిన ఉదయనిధి క్షమాపణ చెప్పాలి. లేకుంటే డీఎంకే పార్టీకి, ఆ పార్టీతో అంటకాగే కాంగ్రెస్ వంటి పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారు.
జమిలి ఎన్నికలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు ఉలికిపాటు? ఎందుకంత అభద్రతాభావం? ఆయనకు ఎందుకు గుబులు పట్టుకుంది? నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలను, సంక్షేమాన్ని తట్టుకోలేక, మోదీ గారి చరిష్మాను జీర్ణించుకోలేక కాంగ్రెస్ విషప్రచారం చేస్తోంది.
1952, 1957, 1962, 1967లో నాలుగుసార్లు జమిలి ఎన్నికలు జరిగాయి. మరి అప్పుడెందుకు కాంగ్రెస్ సమర్థించింది. ఆనాడు కాంగ్రెస్ ఉనికిని కాపాడుకోవడానికే జమిలి ఎన్నికలు నిర్వహించారా? దక్షిణాది, ఉత్తరాది అంటూ నాడు లేని ప్రస్తావన కాంగ్రెస్ కు నేడు ఎందుకు వస్తోంది?
ప్రజల కోసం, సమయం, డబ్బులు వృధా కాకుండా ఉండటం కోసం ఆలోచన చేస్తే దేనికీ భయం? వేలాది కోట్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఖర్చు అవసరమా?
జమిలి ఎన్నికలపై కేంద్రం నియమించిన కమిటీలో ప్రతిపక్ష నాయకుడిగా అధిర్ రంజన్ గారికి అవకాశం కల్పిస్తే కాంగ్రెస్ ఎందుకు పారిపోతోంది?
గతంలో జమిలే జరిగితే స్వయం ప్రతిపత్తి దెబ్బతిన్నదా? దక్షిణాది మీద దాడి జరిగిందా? ఏది ఊహాజనితంగా ఉండదు…పార్లమెంట్ లో చర్చ జరుగుతుంది.
సర్జికల్ స్ట్రయిక్స్ ను కూడా తప్పుబట్టిన కాంగ్రెస్.. జమిలి ఎన్నికల కోసం కేంద్రం నియమించిన కమిటీపై విమర్శలు చేయడం హాస్యాస్పదం.
గతంలో Brsఎంపీ సైతం జమిలి ఎన్నికలు దేశానికి మంచివని వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారు..? పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఊహకు అందని విధంగా అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా జరుగుతాయి. దేశం కోసం చర్చ జరిగి తీరుతుందని లక్ష్మణ్ ముగించారు.