తెలంగాణ ఉద్యమం అనంతరం రాజకీయాల నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న లగడపాటి రాజగోపాల్ అప్పుడప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు. సంచలన కామెంట్లతో తెరపైకి వస్తున్నారు. ప్రతీసారి ఎన్నికల సమయంలో రాజకీయ విశ్లేషణలు చేస్తూ.. తాను ఉన్నానని గుర్తు చేస్తున్నారు. మామూలుగా కాంగ్రెస్ నాయకుడు.. అభిమాని అయిన లగడపాటి రాజగోపాల్ ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా నిలుస్తున్నారు. పలు సందర్భాల్లో పవన్ ది బెస్ట్ అంటూ కితాబు ఇస్తున్నారు.
Also Read: జనసేనకు మద్దతుగా ‘చిరు’ ఉక్కు వ్యూహం?
జనసేన అధినేత వపన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకుని తనను తాను నియంత్రించుకుంటున్నారని.. అది ఆయన రాజకీయ జీవితానికి చాలా పెద్ద మైనస్ పాయింటుగా మారిందని కొద్దిరోజులుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే వీరికి భిన్నంగా మాజీ ఎంపీ… తనను తాను రాజకీయ విశ్లేషకుడిగా చెప్పుకునే లగడపాటి రాజగోపాల్ స్పందించారు. వపన్ కల్యాణ్ రాజకీయంగా గొప్పగా అడుగులు వేస్తున్నారని సర్టిఫికెట్ సైతం ఇచ్చేశారు.
కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా విజయవాడలో తన ఓటుహక్కును వినియోగించుకున్న లగడపాటి.. పవన్ కల్యాణ్ గురించే ముందుగా స్పందించారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ప్రజల కోసం నిలబడుతున్నారని తెలిపారు. ఆయన రాజకీయ వ్యూహాలు బాగున్నాయాని కితాబు ఇచ్చారు. అనూహ్యంగా లగడపాటి రాజగోపాల్ పవన్ కల్యాణ్ ను పొగడడానికి కారణం ఏమిటో కానీ.. జన సైనికులకు మాత్రం కాస్త క్లారిటీ వచ్చింది. పవన్ కల్యాణ్ మొహమాట రాజకీయాలు చేయడం లేదని.. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకునే రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారన్న అభిప్రాయానికి వస్తున్నారు.
Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీనే..!
అయితే లగడపాటి పవన్ కల్యాణ్ ను ప్రశంసించడం వెనుక ఏదైనా తెర వెనుక రాజకీయం ఉందా..? అన్న అనుమానం కూడా జనసేన వర్గాల్లో వస్తోంది. గతంలో సర్వేలు చేసి చేతులు కాల్చుకున్న లగడపాటి.. చాలా కాలంగా రాజకీయ వ్యాఖ్యలకు.. సర్వేలకు దూరంగా ఉంటుంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేది లేదని చెబుతున్నారు. సర్వేలు కూడా చేయనని చెబుతున్నారు. అయితే గత ఎన్నికలకు ముందు టీడీపీతో కలిసి పని చేశారు. ఆ పార్టీ పతనంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయన పవన్ కల్యాణ్ ను ఎందుకు పొగుడుతున్నారో అన్న సందేహం జన సైనికుల్లో వ్యక్తం అవుతోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్