Lagadapati Rajagopal: లగడపాటి రీ ఎంట్రీ.. చేరేది ఆ పార్టీలోనే

2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి లగడపాటి రాజగోపాల్ చేరారు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర బాధ్యతలను సైతం తీసుకున్నారు.

Written By: Dharma, Updated On : December 17, 2023 10:01 am

Lagadapati Rajagopal

Follow us on

Lagadapati Rajagopal: ఆంధ్రా ఆక్టోపస్.. ఈ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది లగడపాటి రాజగోపాల్. కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా.. సర్వే రాయుడు గా ఆయనకు పేరు ఉంది. 2014 వరకు ఆయన మాట చెల్లుబాటు అయ్యింది. ఆయన చేపట్టిన సర్వేలు నిజమయ్యాయి.2018 తెలంగాణ ఎన్నికల్లో తొలిసారిగా ఆయనవెల్లడించిన సర్వే తారుమారు అయ్యింది. 2019 ఏపీ ఎన్నికల్లో సైతం బోల్తా కొట్టింది. దీంతో అప్పటినుంచి లగడపాటి సర్వేలకు స్వస్తి పలికారు.ఇప్పుడు ఏపీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి లగడపాటి రాజగోపాల్ చేరారు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర బాధ్యతలను సైతం తీసుకున్నారు. 2004లో తొలిసారి విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. 2009లో సైతం రెండోసారి బరిలో దిగి విజయం సాధించారు.అయితే రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్రకు మద్దతుగా గట్టిగానే పోరాడారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీని వీడారు. 2014- 19 మధ్య చంద్రబాబుతో పలుమార్లు భేటీ అయ్యారు. దీంతో టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ ఆ పార్టీలో చేరకుండా స్తబ్దుగా ఉండిపోయారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో మళ్లీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

వైసీపీ ఆవిర్భావం తర్వాత విజయవాడ పార్లమెంట్ స్థానం ఆ పార్టీకి దక్కలేదు. 2014, 2019 ఎన్నికల్లో కేసినేని నాని టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. వైసీపీకి రాష్ట్రస్థాయిలో ఏకపక్ష విజయం దక్కిన విజయవాడ లోక్ సభ స్థానం దక్కకపోవడం లోటుగా తెలుస్తోంది. అక్కడ బలమైన అభ్యర్థి కోసం వైసిపి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో లగడపాటి రాజగోపాల్ ను వైసీపీ హై కమాండ్ ఆశ్రయించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై లగడపాటి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. పైగా ఆయన టిడిపి వైపు చూస్తున్నారని సంకేతాలు కనిపిస్తున్నాయి. వైసిపి కంటే టిడిపి వైపు వెళ్లేలా ఆయన చర్యలు ఉన్నాయి.

ప్రస్తుతం విజయవాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేసినేని నాని వ్యవహార శైలి కొద్ది రోజుల కిందట వివాదాస్పదంగా మారింది. టిడిపిలోని ఇతర నాయకులతో ఆయనకు పొసగడం లేదు. అక్కడ అభ్యర్థిని మార్చుతారని టాక్ నడిచింది. ముఖ్యంగా ఆయన సోదరుడు కేశినేని చిన్ని వైపు హై కమాండ్ మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇంతలో ఆ సీటును జనసేన ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల కిందట కేసినేని చిన్ని పవన్ కళ్యాణ్ ను కలిశారు. పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు కేటాయిస్తే చిన్ని ఆ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కొలిక్కి వచ్చాకే లగడపాటి రాజగోపాల్ టిడిపిలోకి ఎంట్రీ ఇస్తారని టాక్ నడుస్తోంది. ఒకవేళ విజయవాడ కుదరకపోతే గుంటూరు కానీ, ఏలూరు కానీ టికెట్ కేటాయించి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలా ఎలా చూసినా లగడపాటి రాజగోపాల్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని.. టిడిపిలో చేరతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.