AP Government: మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు ఉంది ఏపీ ప్రభుత్వ వ్యవహార శైలి. అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా పర్యాటకరంగాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు కొత్త కొత్త ప్రతిపాదనలతో, అలవికాని పనులను తెరపైకి తెస్తోంది. ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయలో పర్యాటకులకు పూర్తిస్థాయిలో వసతులు కల్పించలేకున్న ప్రభుత్వం ఏకంగా రోప్‌వేలు వేసేసి ఆకాశ మార్గంలో పయనింపజేస్తామని ఆశలు రేకెత్తిస్తోంది. ఊహకు కూడా అందని, ఆచరణ సాధ్యం కాని ప్రతిపాదనలు కేంద్రానికి పంపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది! ప్రభుత్వ తీరుపై అధికార వైసీపీ నేతలు కూడా నోరెళ్లబెడుతున్నారు. ‘పర్వతమాల’ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం నేషనల్ రోప్‌వే డెవల్‌పమెంట్ కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రాలు ఈ ప్రాజెక్టు కింద ఏమైనా రోప్‌వేలను ప్రతిపాదిస్తే వాటికి వయబులిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తామని, వాటి నిర్వహణ బాధ్యతలను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చూసుకుంటుందని ప్రకటించింది. ప్రతిపాదిత రోప్‌వేలకు డీపీఆర్, అక్కడ తీసుకునే భద్రతా ప్రమాణాలు ఏమిటో తెలపాలని సూచించింది. దీనికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ద్వారా అనేక జిల్లాల్లో రోప్‌వేలకు ప్రతిపాదనలు సమర్పించింది. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ కూడా వాటికి నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. అందులో విశాఖ జిల్లా లంబసింగి-అరకులోయ ఒకటి.
అది సాధ్యమేనా?
120 కి.మీ. పొడవున రోప్‌వేసాధారణంగా ఒక కొండపై నుంచి మరొక కొండ పైకి, కొండ పైనుంచి కిందికి, నది ఇవతల గట్టు నుంచి అవతల గట్టుకు రోప్‌వేలు వేస్తుంటారు. ఇవి ఒక కిలోమీటరు నుంచి ఐదు కిలోమీటర్ల వరకూ పొడవు ఉంటాయి. కానీ ఇక్కడ సీఎం జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రాజెక్టు లంబసింగి మేఘాల కేంద్రం నుంచి అరకులోయ హిల్‌టాప్ వరకు 120 కి.మీ. దూరం ఉంటుంది. ఇది పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. కొండలు, గుట్టలు, దట్టమైన అడవులతో నిండి ఉంటుంది. లంబసింగి నుంచి అరకులోయకు ఈ మధ్య వరకూ సరైన రహదారే లేదు. ఇటీవలే కేంద్రం తూర్పు గోదావరి జిల్లా నుంచి కొయ్యూరు-చింతపల్లి-పాడేరు-అరకులోయ-అనంతగిరి-బొడ్డవర మీదుగా విజయనగరం జిల్లాకు ఓ జాతీయ రహదారిని ప్రతిపాదించి పనులు చేపట్టింది. లంబసింగి నుంచి అరకులోయ వెళ్లాలంటే మధ్యలో జి.మాడుగుల, పాడేరు, హుకుంపేట, డుంబ్రిగుడ మండలాలు దాటాలి. ఈ మార్గంలో రోప్‌వే అంటే ఊహకు కూడా అందని విషయం. ఈ మార్గంలో ఎక్కడైనా ఏదైనా జరిగితే ఆ సమాచారం ఇతరులకు తెలిసే అవకాశం కూడా ఉండదు. పైగా మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతం. ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టును ప్రతిపాదించి నవ్వుల పాలవడం తప్పితే మరేమీ లేదని వైసీపీ నాయకులే అంటున్నారు.
చేసిన వాటికే దిక్కులేదు
ప్రారంభించిన ప్రాజెక్టులకే దిక్కు లేదు ఇటీవల కాలంలో లంబసింగి పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చెరువులవేనం వద్దకు వెళితే.. శీతాకాలంలో మేఘాల లోకం కనిపిస్తుంది. అక్కడి నుంచే అరకులోయకు రోప్‌వే ప్రతిపాదించారు. అయితే ఈ లంబసింగికి వచ్చే పర్యాటకుల కోసం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.5 కోట్లతో కాటేజీల నిర్మాణం చేపట్టారు. ఆ పనులు చేసిన కాంట్రాక్టర్‌కు రూ.1.7 కోట్ల వరకు నిధులు అందాయి. మరో కోటి రూపాయల పనులకు బిల్లులు రావలసి ఉండగా వైసీపీ ప్రభుత్వం ఈ మూడేళ్లలో రూపాయి కూడా ఇవ్వలేదు. దాంతో కాంట్రాక్టర్ ఆ పనులు ఆపేశారు. ఎనిమిది కాటేజీలను ప్రతిపాదించగా వాటిలో నాలుగు కాటేజీలు 70 శాతం పూర్తిచేసి ఆపేశారు. మిగిలిన వాటి నిర్మాణం ప్రారంభించనే లేదు. తాత్కాలికంగా ఏర్పాటుచేసిన గుడారాలనే పర్యాటకులకు అద్దెకు ఇస్తున్నారు తప్పితే.. ఈ మూడేళ్లలో ఒక్క సౌకర్యం కల్పించలేదు. అరకులోయలో కూడా అదే దుస్థితి. పర్యాటకుల కోసం రూ.2 కోట్లతో ‘డ్రైవ్ ఇన్ రెస్టారెంట్’ నిర్మించారు. దాన్ని నిర్వహించలేక పక్కన పెట్టేశారు. ఇంకా ప్రతిపాదించి చేపట్టని పనులు అనేకం ఉన్నాయి.గాలికొండ నుంచి కటిక జలపాతం రోప్‌వే కూడా అంతేఅరకులోయ సమీపంలోని గాలికొండ వ్యూ పాయింట్ నుంచి కటిక జలపాతం వరకు రోప్‌వే వేయాలని ప్రతిపాదించారు. ఇది కూడా ఆచరణ సాధ్యం కాదని అక్కడి టూరిస్ట్ గైడ్లు చెబుతున్నారు. కొండ పైనుంచి కిందికి రావచ్చు గానీ, మళ్లీ మూడు కిలోమీటర్లు నిట్టనిలువుగా రావడం కష్టమని, అది సాధ్యం కాదని అంటున్నారు.
Recommended Videos
Web Title: Ladders to the sky the road can not be laid but 120 km of rope will be laid
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com