Differences Between Ministers : ఏపీ మంత్రుల్లో సమన్వయం లేదా? లేకుంటే వారి మధ్య విభేదాలున్నాయా? సాటి మంత్రులపై స్పందించిన సమయంలో విభిన్న ప్రకటనలు చేయడం దేనికి సంకేతం? ఓ దళిత మంత్రిపై అదే సామాజికవర్గానికి చెందిన మంత్రి స్పందన విరుద్ధంగా ఉంది.ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చనీయాంశంగా మారింది. మొన్న చంద్రబాబు ప్రకాశం పర్యటనలో అధికార వైసీపీ శృతిమించుతూ వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే. చంద్రబాబు కాన్వాయ్ పై జరిగిన దాడిలో ఎన్ఎస్ జీ కమాండో గాయపడిన సంగతి తెలిసిందే. అదే సమయంలో జిల్లా మంత్రి ఆదిమూలపు సురేష్ చొక్క విప్పుతూ నిరసించారు. నినాదాలు చేశారు. సోషల్ మీడియాలో ఆ దృశ్యాలు వెలుగుచూశాయి కూడా.
నాగార్జున అలా అనేశారేంటి?
దీనిపై ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తాజాగా స్పందించారు. టీడీపీకి కౌంటర్ ఇచ్చే క్రమంలో సాటి మంత్రి అదిమూలపు సురేష్ పై ఆయన విభిన్న కామెంట్స్ చేశారు. ‘మంత్రి ఆదిమూలపు సురేష్ తన చొక్కా తానే ఎందుకు విప్పుకుంటారు? ఆయనకు అంత జ్ఞానం లేదా? చదువు లేదా? అని సందేహం వ్యక్తం చేశారు. ఇది టీడీపీ కావాలని చేస్తున్న ప్రచారంగా చెప్పే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎర్రగుండపాలెంలో పర్యటించిన సమయంలో మంత్రి సురేష్ నిరసన తెలిపిన సమయంలో టీడీపీ వర్గీయులే ఆయనపై దాడిచేశారు. చొక్కా చింపేశారు. తన చొక్కా తనే ఎందుకు విప్పుకుంటారు? ఎందుకు చించేసుకుంటారు? అంటూ మంత్రి నాగార్జున విలేఖర్లకు ఎదురు ప్రశ్న వేశారు.
మంత్రి సురేష్ పావుగా మారారా?
అయితే చంద్రబాబు పర్యటన సమయంలో మంత్రి సురేష్ తన చొక్కను తానే తీసేస్తూ నిరసన తెలిపారు. నినాదాలు చేశారు. అది అన్ని ప్రసారమాధ్యమాల్లో కూడా కనిపించింది. కానీ దానిని కవర్ చేసేలా మంత్రి నాగార్జున మాట్లాడడం విమర్శలకు దారితీస్తోంది. వాస్తవానికి మంత్రి ఆదిమూలపు సురేష్ కు మంచి పేరు ఉంది. విద్యాధికుడు, సౌమ్యుడు అని అన్ని పార్టీలు ఆయన్ను గౌరవభావంతో చూస్తాయి. విద్యాశాఖ మంత్రిగా ఆయనకు మంచి మార్కులే పడ్డాయి. అటు ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు అతడి చొరవను, మంచితనాన్ని కీర్తిస్తాయి. కానీ అటువంటి ఆయన్ను వైసీపీ తన రాజకీయ పావుగా ఉపయోగించుకుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అది చాలదన్నట్టు మంత్రి మేరుగ నాగార్జున సైతం విభిన్నంగా స్పందించడం అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. మంత్రి సురేష్ ను వెనుకేసుకొచ్చినట్టు లేదని.. ఆయన తప్పుచేశారని చెప్పినట్టుందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కామెంట్లు పెడుతున్నారు.