BJP – Jagan : ఏపీ బీజేపీలో మార్పులకు హైకమాండ్ సిద్ధమైందా? యాంటీ వైసీపీ బ్యాచ్ కు ప్రోత్సాహం అందిస్తోందా? జగన్ కు వ్యతిరేకంగా పోరాడాలని ఎందుకు పిలుపునిస్తున్నట్టు? ఇందుకు నలుగురితో కమిటీ ఏర్పాటు చేయడం దేనికి సంకేతం? ఇప్పుడు ఏపీ బీజేపీలో ఇదే చర్చనీయాంశంగా మారింది. కొద్ది నెలల కిందట విశాఖలో ప్రధాని మోదీ పర్యటించారు. అప్పట్లో ఏపీ బీజేపీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వపరంగా తాము కొన్ని విషయాల్లో సన్నిహితంగా ఉన్నా.. పార్టీపరంగా వైసీపీపై గట్టి పోరాటాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నేతలకు దిశా నిర్దేశం చేశారు. కానీ రాష్ట్ర నాయకత్వంలో ఎటువంటి చలనం లేకుండా పోయింది. దీంతో బీజేపీ హైకమాండ్ నలుగురు నేతలతో కమిటీని ఏర్పాటుచేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఎవరికి వారే..
రాష్ట్ర బీజేపీలో వర్గ విభేదాలున్నాయన్నది బహిరంగ రహస్యమే. పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉంటుంది. కొందరు అధికార వైసీపీకి, మరికొందరు విపక్ష టీడీపీకి అనుకూలమైన నేతలు ఉన్నారు. పూర్వం నుంచి కొనసాగుతున్న వారూ ఉన్నారు. అయితే ఏపీలో అధికార వైసీపీపై బీజేపీ నేతలు గట్టిగానే పోరాడుతున్నా ప్రజలు మాత్రం అనుమానంతో చూస్తున్నారు. దీనికి కూడా బీజేపీ నేతలే కారణం. వారు కాషాయదళంలో ఉన్నారన్న మాటే కానీ పార్టీ అభివృద్ధికి పాటుపడిన పాపానపోలేదు. వరుసగా ఎన్నికల్లో ఓటములు ఎదురవుతున్నా ఏకతాటిపైకి వచ్చే ప్రయత్నం చేయడం లేదు.
వైసీపీపై పోరాడాలని..
పార్టీ హైకమాండ్ వైసీపీ సర్కారుపై పోరాటం చేయాలని గట్టి సంకేతాలే పంపింది. చార్జిషీట్ల రూపంలో సమస్యలు, అవినీతిపై నివేదికలు తయారుచేయాలని ఆదేశాలిచ్చింది. మద్యం, ఇసుక, మట్టి, విద్యుత్ ప్రాజెక్టులు, విద్యుత్ మీటర్లు, ట్రాన్స్‌ఫార్మాస్, ఆర్డీఎస్ఎస్, భూ ఆక్రమణలు, మైనింగ్, కాంట్రాక్టులు, పోలవరం, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, సెంటు భూమి పథకంలో అక్రమాలు వంటి వాటిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని సూచించింది. నియోజకవర్గ, మండల, గ్రామస్థాయిలో అక్రమాలపై నిజనిర్థారణలు చేయాలని.. తద్వారా ప్రజలతో మమేకమయ్యేందుకు అవకాశం కలుగుతుందని భావించింది. అయితే బీజేపీలో ఉన్న వర్గ విభేదాలతో ముందుకెళ్లడం రాష్ట్ర నాయకత్వానికి కత్తిమీద సాములా మారింది.
ఆ నలుగురితో..
ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. వీటిపై అధ్యయనానికి నలుగురు నేతలతో కమిటీ నియమించింది. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి, పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌లతో కమిటి ఏర్పాటు చేసింది. ఇలా కమిటీని వేశారో లేదో అప్పుడే కొత్త ప్రచారం ప్రారంభమైంది. ఈ నలుగురు నేతలు యాంటీ వైసీపీ నేతలు. రాష్ట్ర నాయకత్వం ఫెయిలైనందున..జగన్ మనుషులను పక్కనపెట్టి ఈ నలుగురికి బాధ్యతలు అప్పగించిందన్న టాక్ నడుస్తోంది. రాష్ట్ర నాయకత్వానికి పొమ్మన లేక పొగపెట్టిందని.. అందుకే జగన్ యాంటీ వర్గం నాయకులను తెచ్చి కమిటీలో వేశారని బీజేపీలోనే ఓ వర్గం ప్రచారం చేసుకుంటోంది. సో పార్టీని బలోపేతం అన్న పేరుతో కొత్త వర్గాన్ని హైకమాండ్ ప్రోత్సహించినట్టయ్యిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.