ఏపీలో జర్నలిస్ట్ హత్య కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లా నంద్యాలలో జర్నలిస్ట్ కేశవ్ హత్య ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్ అయ్యారు. జర్నలిస్ట్ హత్యోదంతంపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు. హత్యకు పాల్పడిన నిందితులను తక్షణం అరెస్ట్ చేయాలని ఆదేశించారు.
జర్నలిస్ట్ హత్యలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ప్రమేయం ఉండడంతో దుమారం రేపుతోంది. స్థానికంగా అరాచకాలు సృష్టిస్తున్న గుట్కా మాఫియా అరాచకాలను బయటపెట్టారన్న అక్కసుతోనే జర్నలిస్టు కేశవను దారుణంగా హతమార్చినట్టు ఆరోపనలున్నాయి.
నంద్యాలలో ఓ యూట్యూబ్ ఛానెల్ లో కేశవ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాడు. గుట్కా మాఫియాతో నంద్యాలకు చెందిన కానిస్టేబుల్ సుబ్బయ్యకున్న సంబంధాలపై తన యూట్యూబ్ చానెల్ లో జర్నలిస్ట్ కేశవ వార్త రాశాడు. నంద్యాల టూ టౌన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సుబ్బయ్య అవినీతి అక్రమాలపై ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీని ఆధారంగా కానిస్టేబుల్ సుబ్బయ్య ఇటీవల సస్పెండ్ అయ్యాడు. అయితే తన సస్పెన్షన్ కు జర్నలిస్ట్ కేశనే కారణమని కానిస్టుబుల్ సుబ్బయ్య కక్ష పెంచుకున్నాడు.
కానిస్టేబుల్ సుబ్బయ్య, అతడి సోదరుడు నాని కలిసి జర్నలిస్టు కేశవ కోసం కాపు కాసి స్క్రూ డ్రైవర్ తో విచక్షణ రహితంగా పొడిచి చంపాడు. కానిస్టేబుల్ ఒక జర్నలిస్టును చంపడం ఏపీలో కలకలం రేపింది. కర్నూలు ఎస్పీ హత్యస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.
కేశవ హత్య కేసుకు సంబంధించి కానిస్టేబుల్ సుబ్బయ్య, అతడి సోదరుడు నానిలపై హత్య కేసులు నమోదయ్యాయి. హత్య అనంతరం ఇద్దరూ పారిపోగా రెండు టీంలు గాలిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు.
జర్నలిస్ట్ కేశవ దారుణ హత్యను జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఏపీ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చాయి. కర్నూలు జిల్లాలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. హత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.