సినిమా సహజంగా మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి డైరెక్టర్ కథతో తెరకెక్కేది. రెండు డబ్బింగ్ కోటాలో వచ్చేది. మూడోది అఫీషియల్ రీమేక్. కానీ.. నాలుగో రకం కూడా ఉంటుంది. మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాలో అన్నట్టుగా.. ఇది అదో రకమైన సినిమా. అంటే.. ఆల్రెడీ ఎవరో తీసిన కథనే మూలంగా ఎంచుకొని.. కొద్దిగా మార్పులు చేర్పులు చేసి తీసేస్తుంటారు. ఇలాంటి సినిమాలను తరచూ ఎవరో ఒకరు చేసేస్తూనే ఉన్నారు. పెద్ద హీరోలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అలా.. మహేష్ బాబు తీసిన సినిమాలు ఏంటన్నవి ఈ స్టోరీలో చూద్దాం.
మనం పైన చెప్పుకున్న శ్రీమంతుడు సినిమా కూడా ఈ కోవలోనిదే. ఓ కోటీశ్వరుడు సొంత ఊరిని దత్తత తీసుకొని బాగు చేయడమే శ్రీమంతుడు సినిమా కాన్సెప్ట్. ఇదే కథతో దాదాపు 36 ఏళ్ల క్రితం ఓ సినిమా వచ్చింది. అందులో హీరో బాలకృష్ణ. ఆయన సోలో హీరోగా వస్తున్న తొలి రోజుల్లో తెరకెక్కిందీ చిత్రం. టైటిల్ ‘జననీ జన్మభూమి’. ఈ సినిమాలో హీరో కూడా కోటీశ్వరుడు. ఆయన కూడా ఊరిని దత్తత తీసుకొని, ఆ ఊరి జనాన్ని మద్యం నుంచి విముక్తి చేయాలని కంకణం కట్టుకుంటాడు. ఈ క్రమంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటాడు. అయినప్పటికీ.. తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు అన్నదే కథ. కె.విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ సినిమా 1984లో రిలీజ్ అయింది. కానీ.. విజయం సాధించలేదు.
మెగాస్టార్ చిరంజీవి రుద్రవీణ కూడా ఇదే విధమైన కథాంశంతో తెరకెక్కింది. కానీ.. ఈ సినిమా కూడా కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. ఈ రెండు చిత్రాలూ కేవలం ఆ విషయంపైనే ఫోకస్ చేశాయి. అయితే.. ఇదే కథను తీసుకున్న కొరటాల శివ మాత్రం కమర్షియల్ ఎలిమెంట్స్ ను కూడా సమపాళ్లలో తీసుకోవడంతో సూపర్ హిట్ కొట్టింది.
ఇక, మహేష్ బాబు మరో బ్లాక్ బస్టర్ ‘అతడు’ చిత్రం కూడా గతంలో వచ్చిందే. వెంకటేష్ హీరోగా వచ్చిన ‘వారసుడొచ్చాడు’ కథాంశం ఇదే. చనిపోయిన మిత్రుడి స్థానంలో.. అతని ఇంటికి వెళ్తాడు వెంకీ. అప్పటికే.. ఆ ఇళ్లు ఎన్నో సమస్యల్లో ఉంటుంది. అక్కడికి వెళ్లిన వెంకటేష్.. సమస్యలన్నీ పరిష్కరిస్తాడు. ఈ సినిమా అప్పుడూ హిట్ కొట్టింది. ఇప్పుడూ హిట్ కొట్టింది. కొద్ది మార్పులతో ఈ సినిమాను నేటి తరానికి తగ్గట్టుగా రూపొందించాడు త్రివిక్రమ్.
మహేష్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘పోకిరి’లొ మెగాస్టార్ ‘స్టేట్ రౌడీ’ స్ఫూర్తిగా మెండుగా కనిపిస్తుంది. ఈ చిత్రంలో చిరంజీవి కూడా పోలీస్ ఆఫీసర్ కావాలని ఆశిస్తాడు. కానీ.. కొందరి వల్ల సాధ్యం కాదు. అప్పుడు.. తానే అవినీతిని నిర్మూలించే వ్యక్తిగా మారిపోయి, దుష్టులను శిక్షిస్తాడు హీరో. నిజానికి.. మహేష్ బాబుకు రీమేక్ సినిమాలంటే ఏ మాత్రం ఇష్టం ఉండదు. అయితే.. దర్శకులు రీమేక్ చేసిన స్టోరీలను మాత్రం సెలక్ట్ చేసుకున్నారు. సూపర్ హిట్లు కొట్టారు.