లాక్ డౌన్ సమస్యలు అన్ని ఇన్ని కావు. గత సంవత్సరం ఇదే సమయంలో జొమాటో, స్విగ్గీ సంస్థలు వంట చేసుకోని వారికి వరంగా మారాయి. ఉదయం నుంచి రాత్రి వరకు వినియోగదారులకు సేవలు అందిస్తూనే ఉన్నయి. హోటళ్లు మూత పడడంతో ఇంట్లో వండుకునే అవకాశం లేని వారు ఇప్పుడు ఫుడ్ డెలివరీ సంస్థలపై ఆధారపడుతున్నారు. మొన్నటి దాకా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉన్నా శనివారం సంస్థలకు ఇబ్బంది ఎదురైంది. డెలివరీ బాయ్స్ ను పోలీసులు అడ్డుకుని లాఠీచార్జి సైతం చేశారు. దీంతో ఫుడ్ డెలివరీ ఆపేస్తున్నట్లు సంస్థలు ప్రకటించాయి. దీంతో సమస్య ఎదురైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాసులు సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్ కు పోస్టులు పెట్టారు.
ఎసెన్సియల్ సర్వీస్ లో ఫుడ్ డెలివరీని చేర్చి ఇప్పుడు ఉన్నట్టుండి డెలివరీ బాయ్స్ మీద ఈ జులుం ఏమిటని ప్రశ్నలు రేకెత్తాయి. జొమాటో, స్విగ్గీ సంస్థలు డెలివరీ ఆపేస్తున్నట్లుగా ప్రకటనలు చేయడంతో వీటి మీద ఆధారపడిన వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నలు వచ్చాయి. దీనికి స్పందించిన కేటీఆర్ డీజీపీతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తానని చెప్పడంతో సద్దుమణిగింది. దీనిపై డీజీపీ సైతం మాట్లాడుతూ ఆదివారం మరోసారి సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. సోమవారం నుంచి పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
అత్యవసర విభాగంలో ఒకటైన ఫుడ్ డెలివరీ బాయ్స్ పై పోలీసుల దాడి చేయడాన్ని ప్రతి ఒక్కరూ విమర్శించారు. వంట చేసుకునే అవకాశం లేని వారి కోసం వారు చేస్తున్నది సేవయే కదా. అలాంటి వారిపై పోలీసులు జులుం చేయడం సరికాదని హితవు పలికారు. మంత్రి కేటీఆర్ స్పందించి ఇకపై జరగకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు. పోలీసులకు ఎమర్జెన్సీ అంటే ఏంటో తెలియదా అని పలువురు ప్రశ్నించారు.