Minister Seethakka: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. తొమ్మిదనరేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ను గద్దె దించారు. రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు. సీఎంగా రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, మరో 10 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అసెంబ్లీ వేదికగా చేసిన విమర్శలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా కేటీఆర్ మంత్రిగా, నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ముగులు సీతక్కపై చేసిన వ్యాఖ్యలు, పేల్చిన పంచులను ఇప్పుడు కాంగ్రెస్ నేతలు సోషల్‌మీడియాలో వైరల్ చేస్తున్నారు. అధికారం ఉందని, ఇష్టమున్నట్లు మాట్లాడారని ఎద్దేవా చేస్తున్నారు.
సీతక్కను సీఎం చేశారని..
ములుగులో ఈసారి ఎలాగైనా బీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని కేసీఆర్‌తో సహా ముఖ్యనేతలు భావించి సీతక్కకు పోటీగా నక్సలైట్ నేపథ్యం ఉన్న ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చిన బడే నాగజ్యోతిని బరిలోకి దింపారు. తాము మిషన్∙భగీరథతో ఇంటింటికీ నీళ్లిచ్చామని, ప్రజలందరికీ మంచి నీళ్లు తాగించామని, ప్రతిపక్షాలకు మాత్రం మూడు చెరువుల నీళ్లు తాగిస్తామని కేటీఆర్ నాడు సెటైర్లు పేల్చారు. ఈసారి ఓడించే వారిలో సీతక్క కూడా ఉందని ప్రకటించారు. అయినప్పటికీ అక్కడ ప్రజలు మళ్లీ సీతక్కకే పట్టం కట్టారు. ఇక గతంలో అసెంబ్లీలో సీతక్కను రేవంత్‌రెడ్డి సీఎం చేశారని ఎద్దేవా చేశారు. సీఎం సీతక్కగారు.. ఈ తమ్ముడిని మర్చిపోకండి అంటూ పంచులు వేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు కేటీఆర్. గతంలో ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాంలో కరెంటు కష్టాలు ఎలా ఉన్నాయో అసెంబ్లీలో చెప్పారని, అసెంబ్లీ రికార్డులనుంచే తాను ఆయన మాటల్ని తీసుకుని వినిపిస్తున్నానని చెప్పారు.
రేవంత్ అంటే ఇష్టం లేదా..
రేవంత్ రెడ్డి గురించి ప్రస్తావించినప్పుడు కాంగ్రెస్ సభ్యులు అడ్డుచెప్పబోగా.. మీకు రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేదా అంటూ సెటైర్లు వేశారు. తాను నిజాలు చెబుతుంటే ఒప్పుకోడానికి భట్టి విక్రమార్కకు భేషజాలు ఉండొచ్చేమో కానీ సీతక్కకు ఉండకపోవచ్చన్నారు. సీతక్క నియోజకవర్గం ములుగుని సీఎం కేసీఆర్ జిల్లాగా చేశారని, ములుగు జిల్లా ఉత్తమ జిల్లాపరిషత్ గా అవార్డు కూడా గెలుచుకుందని చెప్పారు. సీతక్కను సీఎం అభ్యర్థిగా రేవంత్‌రెడ్డి ప్రకటించారని కూడా గుర్తు చేశారు.
అడ్డుకుంటే ఇలా..
అంతలో శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క అడ్డుతగలగా.. అంటే వారికి సీతక్క సీఎం అభ్యర్థిగా ఇష్టం లేదా అని చురకలంటించారు. తెలంగాణ కాంగ్రెస్, పాకిస్తాన్ క్రికెట్ టీమ్ లాంటిదని, అందులో ఒక కెప్టెన్, మిగతా 10మంది ఫార్మర్ కెప్టెన్లు ఉంటారన్నారు. భట్టి విక్రమార్క ఇక్కడ ప్రసంగిస్తుంటే, ఆయనకు గాంధీ భవన్లో గోతులు తవ్వుతున్నారని సెటైర్లు పేల్చారు. ఇటీవల పాదయాత్ర చేసి భట్టి విక్రమార్క అలసిపోయారని, ఆయనకు కన్ఫ్యూజన్ ఉంది కానీ, క్లారిటీ లేదన్నారు. స్పీకర్ అనుమతితో భట్టి విక్రమార్కకు నిమ్స్‌లో ఆస్పత్రిలో ఫిజియో థెరపీ చేయిస్తామన్నారు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఈ వ్యాఖ్యలనే గుర్తు చేస్తున్న కాంగ్రెస్ నేతలు..
కేటీఆర్ అధికారంలో ఉన్నామని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలపై చేసిన విమర్శలను ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు గుర్తుచేస్తున్నారు. కేటీఆర్ టార్గెట్‌గా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కాకపోయినా సీతక్క మంత్రి అయ్యారని గుర్తుచేస్తున్నారు. కేటీఆర్‌ను తప్పకుండా గుర్తు పెంటుకుంటారని పంచులు పేలుస్తున్నారు. భట్టి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి మాట్లాడిన మాటలను కూడా వైరల్ చేస్తున్నారు. వీటన్నింటికి త్వరలో అసెంబ్లీలో రివర్స్ పంచులు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అధికారం శాశ్వతం కాదని, అణకువ ఉండాలని నెటిజన్లు సూచిస్తున్నారు.