KTR Language Style: తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు.. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖామాత్యులు కల్వకుంట్ల తారకరామారావు కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నారు. దుర్భాషలాడడంలో.. బూతు పదాలు వాడడంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వారసుడినే అని నిరూపించుకుంటున్నారు. తాజాగా వరంగల్ పర్యటన సందర్భంగా ఆయన వాడిన భాష, పద ప్రయోగం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అమెరికా నుంచి వచ్చాడు.. ఉన్నత విద్యావంతుడు.. సబ్జెక్టు తెలిసి మాట్లాడుతాడు అనుకున్న రాష్ట్ర ప్రజలంతా ముక్కున వేలేసుకునేలా వరంగల్‌లో తన ప్రసంగం కొనసాగించారు. భాషకు కేసీఆరే అందరికీ గురువు అని ఇన్నాళ్లు అనుకున్నామని..కానీ కేటీఆర్ కూడా తగ్గేదేలే అన్నట్లు మాటలు వదిలారని బీజేపీ నేతలు సెటైర్లు వేశారు. అయితే ఇంత ఫ్రస్టేషన్ కేటీఆర్‌లో ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.
-తెలంగాణ తెచ్చినందుకే జీవితాంతం పాలించాలా?
తెలంగాణ రాష్ట్ర సాధనను తమ ఖాతాల్లో వేసుకునేందుకు గులాబీ బాస్ కేసీఆర్ మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారు. తానొక్కడితోనే రాష్ట్రం సాధ్యమైనట్లు చెప్పుకుంటున్నారు. తండ్రి తానా అంటే కొడుకు తందానా అన్నట్లు కొద్ది రోజులుగా కేటీఆర్ కూడా అదే రాగం అందుకున్నారు. ‘కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా.. స్వరాష్ట్ర ఆకాంక్ష కేవలం కేసీఆర్‌తోనే సాధ్యమైంది. కేసీఆర్ కొట్లాడకుంటే మన బతుకులు బాగు పడేనా.. మన నీళ్లు, నిధులు మనం వినియోగించుకునేటోళ్లమా?’ అంటూ ప్రసంగిస్తూ.. ప్రశ్నిస్తున్నారు. తండ్రి ఒక్కడే తెలంగాణ సాధిస్తే మరి ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, సబ్బండ వర్ణాలు ఏం చేసినట్లో మరి. 1200 ప్రాణత్యాగం మొత్తం కేసీఆర్ ఖాతాలో వేసే ప్రయత్నాన్ని మళ్లీ మొదలు పెట్టారు గులాబీ నేతలు. ఇందులో భాగంగా తెలంగాణ సాధించినందుకే జీవితాంతం టీఆర్‌ఎస్సే తెలంగాణను పాలించాలని ప్రకటించారు. ఇంతకంటే పెద్ద అర్హత ఏం కావాలని ప్రశ్నించారు. మరి ఇదే నిజమైతే స్వాతంత్రం సాధించినందుకు కాంగ్రెస్ కూడా దేశం మొత్తాన్ని పాలించాలి కదా. అప్పుడు టీఆర్‌ఎస్ ఎక్కడుంటది. కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ ప్రసంగం చూస్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్న విషయాన్ని మర్చిపోయి తాము రాజులం తెలంగాణ తమ సామ్రాజ్యం.. ఇప్పుడు మానాన్న.. ఆయన తర్వాత నేను.. అనే రాజరికపు మాటలు మాట్లాడినట్లు బీజేపీ నేతల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాసామ్య దేశంలో ప్రజలే పాలకులు. అధికారం ప్రజలు పెట్టే భిక్షే… కానీ కేటీఆర్ ఈ విషయం విస్మరించడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Also Read: AP high Court: మరోసారి జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు.. ఆన్ లైన్ టికెట్ల విషయంలో..
-తన పదవి ఎడమకాలి చెప్పులా వదిలేస్తా..
దేశాన్ని పోషిస్తున్న మొదటి ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అంటూ తెలంగాణ మంత్రులు కొన్ని రోజులుగా ప్రచారం చేసుకుంటున్నారు. రాష్ట్రం నుంచి చెల్లిస్తున్న పన్నులతోనే కేంద్రం పాలన సాగిస్తోందని, కేంద్రం ఎక్కువ పన్నులు తీసుకుని రాష్ట్రానికి తక్కువ నిధులు కేటాయిస్తోందని పేర్కొంటున్నారు. నిజమే కావచ్చు.. కానీ ఏ రాష్ట్రం ఎంత చెల్లిస్తే అంత తిరిగి అదే రాష్ట్రానికి కేటాయిస్తే మరి పేద, చిన్న రాష్ట్రాల అభివృద్ధి ఎలా సాధ్యమో కేటీఆర్‌కు తెలియదా? దేశాన్ని పాలిస్తామంటూ కొన్ని రోజులుగా ప్రచారం చేసుకుంటున్న నాయకులు రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి వసూలవుతున్న పన్నుల మొత్తాన్ని మరి హైదరాబాద్‌లోనే ఖర్చు చేస్తున్నారా? అలా చేస్తే రైతుబంధు, రైతుబీమా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌కు నిధులు ఇవ్వగలరా ఆలోచించాలి. కేంద్రం తక్కువ నిధులు ఇస్తోందని గొంతు చించుకుంటన్న తెలంగాణ మంత్రులు కూడా గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో జరిగిన అభివృద్ధి తమ నియోజకవర్గాల్లో ఎందుకు జరుగడం లేదని ప్రశ్నించే ధైర్యం చేయగలరా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఈ చర్చ, రచ్చ జరుగుతూనే ఉంది. అయినా కేటీఆర్ వరంగల్ సభలో మరోమారు ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.. ‘రాష్ట్రం చెల్లించిన పన్నులకంటే కేంద్రం ఇచ్చిన నిధులు ఎక్కువైతే తన పదవిని ఎడమకాలి చెప్పుల వదిలేస్తా’ అంటూ ప్రజలు ఇచ్చిన పదవినే కించపర్చేలా చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమువుతున్నాయి. ఏడాది క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇలాగే ముఖ్యమంత్రి పదవి తన ఎడమకాలి చెప్పుతో సమానం అని వ్యాఖ్యానించి నాలుక కర్చుకున్నారు. ఇప్పుడు కేటీఆర్ కూడా కేసీఆర్ లానే రాజ్యాంగ బద్ధమైన పదవులను అపహాస్యం చేయడం మంచిది కాదన్న భావన వ్యక్తమవుతోంది.
-తెలంగాణ లేకుంటే పదవులొచ్చేవా..?
తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ సాధించకపోతే ప్రతిపక్ష నాయకులకు పదవులు వచ్చేవా? టీపీసీసీ, టీబీజేపీ, టీ లెజిస్ట్రేటివ్ పదవులు మీకు వచ్చేనా అంటూ ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. కావొచ్చు… తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే పదవులు వచ్చాయి అనేది వాస్తవం. మరి ఇదే రాష్ట్రం కాంగ్రెస్ ఇవ్వకపోతే.. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దుతు ఇవ్వంకుటే ప్రత్యేక రాష్ట్రమే ఉండేది కాదు. అప్పుడు కేసీఆర్, కేటీఆర్, మంత్రులకు పదవులు ఎలా వచ్చేవనే ఆలోచన కూడా చేయకుండా విమర్శించాలి.. కాబట్టి నా ఇష్టానుసారం మాట్లాడుతా ఉంది కేటీఆర్ ప్రసంగం అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ భాషను సినిమాల్లో ఇప్పుడు హీరోలకు పెడుతున్నారు.. అది స్వరాష్ట్ర సాధనతోనే సాధ్యమైంది.. తెలంగాణ నటీనటులకు గౌరవం పెరిగింది. తెలంగాణ అంటే అట్టుంటది అని మాట్లాడిన కేసీఆర్.. గౌరవప్రదమైన పదవిలో ఉంటూ.. ప్రధాని, కేంద్ర మంత్రులు, రాష్ట్రంలోని ప్రతిపక్షాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, బూతు మాటలు దేనికి సంకేతం.. ప్రజలకు, పార్టీ కేడర్‌కు ఏం సంకేతం ఇస్తున్నట్లు మరి. ‘అనాల్సిన మాటలన్నీ అని.. తాము బూతులు మాట్లాడడం మొదలు పెడితే తమకంటే ఎక్కువ ఎవరూ మాట్లాడరు’ అంటూ తమ బూతు పురాణం గురించి గొప్పగా చెప్పుకోవడం ఇంకా అసహ్యంగా ఉంది. ఇన్నాళ్లూ కేటీఆర్‌ను ఒక పనిచేసే మంత్రిగా.. ప్రజా సమస్యలపై స్పందించే నాయకుడిగా గుర్తించిన వారు కూడా వరంగల్ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు విని ముక్కున వేలేసుకుంటున్నారు. మీకూ.. మీ బూతు మాటలకూ ఓ దండం సామీ.. అంటున్నారు.
Also Read:CM Jagan Early Elections: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు.. ప్రణాళికలు సిద్ధం చేసిన సీఎం జగన్
Recommended Videos: