Harish Rao: తెలంగాణలో ఎన్నికల వాతావరణం తారస్థాయికి చేరింది. నామినేషన్ల స్క్రూట్ని పూర్తి కావడంతో అభ్యర్థులు ప్రచారంలోకి దిగారు. ఎవరు ఎవరెవరితో తలపడుతున్నారనేది స్పష్టంగా తేలిపోయింది. ఈ క్రమంలో ప్రజలకు దగ్గరయ్యేందుకు నాయకులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాలను విరివిగా వినియోగించుకుంటున్నారు. ఆ వరుసలో ముందు స్థానంలో ఉంటున్నారు కేటీఆర్, హరీష్ రావు. ఏకకాలంలో ప్రచారాలు నిర్వహిస్తూనే వివిధ న్యూస్ చానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సోమవారం అటు హరీష్ రావు ఎన్టీవీలో, కేటీఆర్ ఇటు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముఖాముఖిలో పాల్గొన్నారు.. ఎన్టివిలో హరీష్ రావు అక్కడి పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు గుక్క తిప్పుకోకుండా సమాధానం చెప్పారు.
ప్రభుత్వ విధానాలపై..
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీ కి సంబంధించిన విషయాలను ఎన్ టీవీ ఛానల్ ప్రతినిధులు హరీష్ రావును పదేపదే ప్రశ్నించారు. దీనికి కూడా ఆయన అదే స్థాయిలో సమాధానం చెప్పారు. పేపర్ లీకేజీ అనేది దురదృష్టకరమని, అటువంటి సంఘటనను ఏ సర్కార్ కూడా జరగాలని కోరుకోదని ఆయన వివరించే ప్రయత్నం చేశారు. పేపర్ లీకేజీని ప్రభుత్వమే ముందుగా గుర్తించిందని, ఆ తర్వాత దోషులపై చర్యలు తీసుకుందని హరీష్ రావు ఉదహరించారు.
కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే
హరీష్ రావు తో జరిగిన ఈ ఇంటర్వ్యూలో ఎన్టీవీ తరుఫున పాల్గొన్న వారు ప్రధానంగా ఒక ప్రశ్న అడిగారు. రేపటి నాడు జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ అవడం ఖాయం. అలాంటప్పుడు ఆ ప్రభుత్వంలో మీ పాత్ర ఏమిటి? అని ఎన్టీవీ ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి హరీష్ రావు నవ్వుతూ సమాధానం చెప్పారు. నేను ఇబ్బంది పడే ప్రశ్న మీరు అడుగుతున్నారు. వాస్తవానికి కేటీఆర్, నేను మంచి స్నేహితులం. ఆయన నేను బావబామ్మర్దులం కూడా. మేము కేసీఆర్ చెప్పిన లైన్ లోనే నడుచుకుంటాం. ఆయన ఏది చెబితే అదే చేస్తాం. అంతేతప్ప పార్టీకి వ్యతిరేకంగా ఏనాడూ పనిచేసే తీరు నాకు లేదు.. కెసిఆర్ ఒక లైన్ గీస్తే ఆ లైన్ పరిధిలో మాత్రమే నేను పని చేస్తాను. ఒకవేళ భవిష్యత్తులో కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన ప్రభుత్వంలో పని చేయడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని హరీష్ రావు బదులిచ్చారు.