టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్, ఆర్థిక మంత్రి హరీష్ రావు పుట్టిన రోజు నేడు. 48వ పుట్టిన రోజున జరుపుకుంటున్న ఆయనకు రాజకీ య, సినీ ప్రముఖులు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి ముందుండి పోరాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు. సాగునీటి ప్రాజెక్టులను త్వరతగతిన పూర్తి చేసేందుకు కృషి చేశారు. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు.
ఇదిలా ఉంటే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన బావా అయిన హరీష్ రావుకు తనదైన శైలిలో ట్వీటర్లో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి అందరినీ ఆకట్టుకున్నారు.
‘గౌరవనీయులైన ఆర్థిక మంత్రి, మంచి పనిమంతుడు, డైనమిక్ హరీశ్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు.. జీవితాంతం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా బావా.. నిత్యం ప్రజా సేవలో తరించిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.. రాజకీయంగానైనా ప్రభుత్వ రంగంలోనైనా నీతో కలిసి పనిచేయడం గొప్పగా భావిస్తున్నా’ అంటూ హరీష్ రావుతో దిగిన రెండు ఫొటోలను కేటీఆర్ ట్వీట్ చేశారు. గతేడాది కూడా కేటీఆర్ హరీష్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు. గతేడాది ఆయన పుట్టిన నాటికి కేటీఆర్, హరీష్ రావులకు మంత్రి పదవులు దక్కలేదు. గతేడాది జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్న హరీష్ రావు నేడు కరోనా కారణంగా సెలబ్రేషన్స్ చేసుకోవడం లేదని ప్రకటించారు.
తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు హరీష్ రావు అంటూ ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పారు. కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని.. ఈ సమయంలో అందరం స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. కార్యకర్తలు ఎలాంటి సెలబ్రేషన్స్ నిర్వహించవద్దని అభిమానులను హరీష్ రావు కోరారు