
KTR Bandi sanjay: తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లతో దద్దరిల్లాయి. ఈరోజు రాజకీయం రంజుగా సాగింది. ఢిల్లీలో కేసీఆర్, మోడీషాలు దోస్తీ చేస్తుంటే తెలంగాణ గల్లీల్లో మాత్రం టీఆర్ఎస్, బీజేపీ నేతలు పచ్చిగా తిట్టుకుంటున్న వైనం చర్చనీయాంశమైంది. ముందుగా ఈ సవాళ్లకు తెరతీసింది మంత్రి కేటీఆర్ కాగా..ఆ తర్వాత బండి సంజయ్ దీనికి కౌంటర్ ఇచ్చి కాకరేపారు.
గద్వాల పర్యటనలో ఉన్న కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. చిన్నపాడు స్టేజీ వద్ద విత్తన పత్తి రైతులతో మాట్లాడారు. ‘రేవులపల్లి వద్ద జూరాల పార్కుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు సంచలన సవాల్ చేశారు.
‘ఆరున్నరేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్లు వెళ్లాయి. రాష్ట్రానికి కేంద్రం రూ.1.42 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇది నిజం కాకపోతే నేను మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. బండిసంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా?’ అని మంత్రి కేటీఆర్ సంచలన సవాల్ చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు మొత్తం నిధులు కేంద్రం ఇస్తే కర్ణాటకలో ఎందుకు లేవని ప్రశ్నించారు. తెలంగాణ పన్నులను ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేసి రాష్ట్రాన్ని ప్రధాని మోడీ దగా చేస్తున్నారని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
ఇక ఈ వ్యాఖ్యలపై మెదక్ జిల్లా పాదయాత్రలో ఉన్న బండి సంజయ్ కౌంటర్ ఇచ్చాడు. తను రాజీనామా చేయాలంటూ మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ పై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. ‘‘నువ్వో తూట్ పాలిష్ గాడివి. నీవన్నీ తుపాకీ రాముడి మాటలు. చదువుకున్న అజ్ఝానివి. రాజ్యాంగం కూడా తెలియనోడివి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాలకు 32 శాతం వాటా నిధులిస్తే…నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చాక 41 శాతానికి పెంచింది. ఇది గాక జాతీయ విపత్తులకు అదనంగా నిధులిస్తోంది. దేశ రక్షణ, ఫ్రీ వ్యాక్సిన్ నిధులన్నీ కేంద్రానివే. కనీస జ్ఝానం లేకుండా మాట్లాడుతున్నాడు. అలాంటి తుపాకీ రాముడి మాటలు పట్టించుకునేదెవరు? చేతనైతే నీ అయ్య(కేసీఆర్)ను రమ్మను. మాట్లాడతా’’అని అన్నారు. నిజానికి రాజీనామా చేయాల్సింది కేసీఆరేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని వ్యక్తి. ఉద్యోగాలివ్వనందుకు, రుణమాఫీ అమలు చేయనందుకు, నిరుద్యోగ భ్రుతి ఇవ్వనందుకు కేసీఆర్ రాజీనామా చేయాలి’’అని మండిపడ్డారు. దీంతో కేటీఆర్ సవాల్ కు కేసీఆర్ ను ముడిపెట్టి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.
ఇలా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు రాజీనామాల సవాళ్లు, ప్రతిసవాళ్లు సాగాయి. కేటీఆర్ చేసిన సవాల్ ను స్వీకరించని బండి సంజయ్.. తాజాగా కేసీఆర్ రాజీనామా చేయాలని కోరారు. మరిప్పుడు ఈ రాజకీయం ఎటువైపు మరలుతుందనేది వేచిచూడాలి.