Krishna River: కృష్ణా.. తీరని నీటి తృష్ణ.. సందిగ్ధంలో లక్షల ఎకరాల ఆయకట్టు భవితవ్యం

2015-16 వాటర్‌ ఇయర్‌ (2015 జూన్‌ 1నుంచి 2016 మే నెలాఖరు వరకు) మొత్తం కలిపి శ్రీశైలం ప్రాజెక్టుకు 74.46 టీఎంసీల వరద మాత్రమే రాగా.. ఆ తరువాత ఏటేటా పెరుగుతూ వచ్చింది.

Written By: Rocky, Updated On : September 2, 2023 2:45 pm

Krishna River

Follow us on

Krishna River: కారు మబ్బులు లేవు. ఉరుముల, మెరుపుల జాడలేదు. ముంచెత్తే వర్షాలు కురవడం లేదు. ఫలితంగా పొలాలన్నీ బీళ్ళుగా దర్శనమిస్తున్నాయి. పోసిన వరి నారుమడులు ఎండిపోతున్నాయి. వేసిన నాట్లు ఎండిపోతున్నాయి.. స్థూలంగా చూస్తే కృష్ణా బేసిన్‌కు మళ్లీ ఎనిమిదేళ్ల కిందటి దుస్థితి తలెత్తింది. ఈ బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులకు వరదనీటి రాక భారీగా తగ్గిపోయింది. కనీసం దగ్గరి ఆయకట్టుకు నీరు విడుదల చేసే పరిస్థితి కూడా లేదు. దీంతో ఆయకట్టు రైతులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు.

ఇప్పటివరకు 100 టీఎంసీలు మాత్రమే..

2015-16 వాటర్‌ ఇయర్‌ (2015 జూన్‌ 1నుంచి 2016 మే నెలాఖరు వరకు) మొత్తం కలిపి శ్రీశైలం ప్రాజెక్టుకు 74.46 టీఎంసీల వరద మాత్రమే రాగా.. ఆ తరువాత ఏటేటా పెరుగుతూ వచ్చింది. కానీ, ఈ సీజన్‌ (2023-24)లో మాత్రం ఇప్పటిదాకా 101.77 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. రానున్న రోజుల్లోనూ ఇక వరద వచ్చే అవకాశాల్లేవనే సంకేతాలున్నాయి. ఇవి బేసిన్‌లో సాగునీటిపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల పరిధిలో పంటలు సాగవుతున్న పరిస్థితులు కానరావడం లేదు. ఓవైపు గోదావరి బేసిన్‌లో భారీ వరదలతో ఆ బేసిన్‌ లోని ప్రాజెక్టులన్నీ దాదాపుగా నిండి.. సాగు జోరుమీదుండగా, కృష్ణా బేసిన్‌లో మాత్రం గడ్డుకాలం నడుస్తోంది. కృష్ణా బేసిన్‌లో అతిపెద్ద ప్రాజెక్టులు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్‌ పూర్తిగా నిండి, తుంగభద్ర కూడా దాదాపు నిండినప్పటికీ కీలకమైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు.

ఆరు లక్షల ఎకరాల ఆయకట్టు

నాగార్జునసాగర్‌ పరిధిలో 6లక్షల ఎకరాల ఆయకట్టు తెలంగాణలో ఉంది. ఇదే కాకుండా.. ఎస్‌ఎల్‌బీసీ కింద 2.66 లక్షల ఎకరాలు, శ్రీశైలం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద 3.69 లక్షల ఎకరాల ఆయకట్టు రెండు కీలక ప్రాజెక్టుల కింద ఉంది. మొత్తంగా దాదాపు 12 లక్షల ఎకరాల ఆయకట్టులో ఈ సీజన్‌లో సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో తాగునీటి అవసరాల కోసమైనా నిల్వలను కాపాడుకోవాలని అధికార యంత్రాంగం శతవిధాలా ప్రయత్నిస్తోంది. 2024 మే 31 దాకా తాగునీటి అవసరాల కోసం 26 టీఎంసీలు కావాలని తెలంగాణ అంచనా వేసింది. అందులో సాగర్‌ నుంచి 21 టీఎంసీలు, శ్రీశైలం నుంచి 5 టీఎంసీలు అవసరమని భావిస్తోంది. అయితే శ్రీశైలంలో తాగునీటి అవసరాల కోసం నీటి లభ్యత ఉన్నప్పటికీ.. నాగార్జునసాగర్‌లో మాత్రం లేదు. శ్రీశైలంలో ప్రస్తుతం కనీస నీటిమట్టానికి ఎగువన 53 టీఎంసీల దాకా నిల్వలు ఉండగా.. సాగర్‌లో 15 టీఎంసీల దాకా ఉన్నాయి. దాంతో శ్రీశైలంలో జలవిద్యుత్తు ఉత్పాదన చేసి.. నీటిని సాగర్‌కు విడుదల చేయాల్సి ఉంటుంది. కృష్ణా బేసిన్‌లో వర్షాభావం నెలకొనడానికి ఎల్‌నినో ప్రభావమే కారణమని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వరుసగా నాలుగేళ్లపాటు బేసిన్‌కు భారీగా వరదలు వస్తే.. ఐదో ఏటా దీని ప్రభావం ఉంటుందని, అందుకే గత ఏడాది భారీగా వరద వచ్చిందని అధికారులు గుర్తు చేస్తున్నారు.

నీటి లెక్కలు ఇలా..

2019-20లో 1786 టీఎంసీల వరద రాగా… 2020-21లో 1785 టీఎంసీలు, 2021-22లో 1102 టీఎంసీలు, 2022-23లో 2039 టీఎంసీల వరద వచ్చింది. 15 ఏళ్లకాలంలో 2022-23లో నే అత్యధికంగా వరద వచ్చింది. దాంతో జలవిద్యుత్తునూ రికార్డు స్థాయిలో తెలంగాణ ఉత్పత్తి చేసింది. 2021-22లో 5654 మిలియన్‌ యూనిట్ల జలవిద్యుత్తు ఉత్పాదన జరగగా, 2022-23లో 6058 మిలియన్‌ యూనిట్లను ఉత్పత్తి చేశారు. కానీ, ఈ ఏడాది ఇప్పటిదాకా 585 మిలియన్‌ యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేసిన నేపథ్యంలో ఈ సీజన్‌లో మొత్తం 2వేల మిలియన్‌ యూనిట్లు కూడా దాటే అవకాశాలు లేవని తెలుస్తోంది. గత ఏడాది ఇదే సమయానికి నాగార్జునసాగర్ నుంచి నీటిని మొత్తం గేట్ల ద్వారా కిందికి వదిలారు. జల విద్యుత్ ఉత్పాదన కూడా చేశారు. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. ఇప్పటికే నైరుతి దాదాపు ముగిసిన నేపథ్యంలో.. ఈ ఏడాదికి ఇంతే అని సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారులు అంటున్నారు.