
టీపీసీసీ అధ్యక్ష పదవి తనకు దక్కలేదనే కోపంతోనే మాట్లాడానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఒక సీనియర్ నేతగా అలా మాట్లాడానని వివరణ ఇచ్చారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా భువనగిరిలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇప్పటికే పలు పార్టీల నుంచి ఆహ్వానాలు అందాయని పేర్కొన్నారు. కానీ తాను కాంగ్రెస్ లోనే ఉంటానని తేల్చి చెప్పారు. సీనియర్లను కాదని జూనియర్లకు ఇవ్వడంతో సహజంగానే ఆగ్రహం కలిగిందని చెప్పారు.
గాంధీ భవన్ లో కూర్చుంటే విజయాలు రావని సూచించారు. పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై పోరాటాలు చేస్తేనే గెలుపు తథ్యమని అన్నారు. అలుపు లేకుండా కష్టపడాల్సి ఉంటుందని తెలిపారు కేసీఆర్ ను ఓడించాలంటే అందరు కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రతి కార్యకర్త తన శక్తివంచన లేకుండా కదలాలని చెప్పారు.
అన్ని అర్హతలున్నా పదవి రాకపోవడం బాధాకరమే అన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి కాదని కొత్త వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై సందేహం వ్యక్తం చేశారు. పదవి రానంత మాత్రాన పార్టీ మారతారని పుకార్లు పుట్టించడం సరికాదన్నారు. తనను భువనగిరి ప్రజలు ఒక్క పైసా ఖర్చు లేకుండా గెలిపించారని పేర్కొన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవికే రాజీనామా చేశానని అన్నారు. ఇంత చిన్న విషయానికి ఎందుకు కినుక వహిస్తానని పేర్కొన్నారు.
పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో కొన్ని విషయాలు చోటుచేసుకున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. దీనిపై అధిస్టానం సైతం ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. హైకమాండ్ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ ఇన్ చార్జి మాణిక్యం ఠాకూర్ తెలిపినట్లు పేర్కొన్నారు. దీంతో తాను ఇక ఏం మాట్లాడనని చెప్పినట్లు గుర్తు చేశారు.
రాష్ర్టంలో జరుగుతున్న పరిణామాలపై పట్టు ఉండాలని సూచించారు. అప్పుడే పార్టీల బలాబలాలపై అంచనాలు వేసి వాటిని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రచించే వీలుంటుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో, రాష్ర్టంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు బలంగా ఉన్నాయన్నారు. వాటిని ఢీకొట్టాలంటే మనలో కూడా ఐక్యత ఉండాలని అన్నారు. దీనికి మనమంతా కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.