Komatireddy Brothers: పార్టీ పరిస్థితి “హస్త”వ్యస్తమవుతోంది. “చేతి”లో నేతలు ఒక్కొక్కరుగా బయటికి వెళ్తున్నారు. కష్టకాలంలో “చేతి”కి చేయూతను ఇచ్చేవారే కరువవుతున్నారు. నిన్న రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. నేడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కమలం తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండలో ఒకప్పుడు ఎంతో బలంగా ఉన్న కాంగ్రెస్ నేడు ఈ దుస్థితికి రావడం ముమ్మాటికి స్వయంకృతాపరాధమే. మరోవైపు దుందుడుకుగా వ్యవహరిస్తున్న బిజెపి దక్షిణ తెలంగాణలో బలాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది. కేవలం కోమటిరెడ్డి సోదరుల ద్వయాన్ని మాత్రమే కాకుండా నాగార్జునసాగర్ లో బలమైన నేతగా పేరొందిన జానారెడ్డి కొడుకును కూడా పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ఈటల రాజేందర్ ఒక దఫా చర్చలు పూర్తి చేశారని సమాచారం. ఈ విషయాన్ని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాకు చెప్పడంతో ఆయన కూడా చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

…
తమ్ముడికి తోడుగా అన్న
…
రాజగోపాల్ రెడ్డికి, వెంకటరెడ్డికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ కలిసే కాంట్రాక్టులు చేస్తున్నారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న రాజగోపాల్ రెడ్డి పలుమార్లు తన నిరసన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి కూడా పార్టీ పెద్దలకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన కమలం తీర్థం పుచ్చుకోవడం లాంఛనమే. అయితే ఇన్ని పరిణామాలు తర్వాత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నది నిన్న రేవంత్ రెడ్డి పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు. అతని తమ్ముడు ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి బిజెపిలో చేరుతున్న విషయాన్ని పక్కన పెట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. రేవంత్ రెడ్డి చేసిన ఒక్క వ్యాఖ్య ఆధారంగా ఆయనపై ఫైర్ అయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే తాను కూడా బిజెపిలో చేరుతునాన్ననే సంకేతాలు ఇచ్చారు. మునుగోడు లో రాజగోపాల్ రెడ్డి తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉండటంతో అండగా నిలిచేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాషాయ కండువా కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి.. పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై స్వరం పెంచారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి అందుకు దీటుగా బదులిచ్చారు. ” కాంగ్రెస్ పార్టీ లేకుంటే మీరు మద్యం సీసాలు ఏరుకునేందుకు కూడా పనికి వచ్చేవారు కాదని” వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలకు నొచ్చుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి పై ఫైర్ అయ్యారు. మీరు అంటే రాజగోపాల్ రెడ్డి మాత్రమే కాదని, తాను కూడా అందులో ఉంటానని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్ పార్టీ పెద్దగా పుంజుకున్నది కూడా ఏమీ లేదని ఆయన మండిపడ్డారు.
…
కాంగ్రెస్ పెద్దలు పొమ్మన లేక పొగ పెడుతున్నారా
…
వాస్తవానికి కోమటిరెడ్డి సోదరుల ఆగ్రహం ఇవాల్టిది కాదు. గతంలోనూ రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఇదే స్థాయిలో తమ నిరసన వ్యక్తం చేసేవారు. అప్పట్లో ప్రతిపక్ష నేతలతో కూడా టచ్ లో ఉండేవారు. ఆ పరిణామాలు కాంగ్రెసులో అప్పట్లో పెద్ద దుమారాన్ని లేపేవి. తర్వాత అంతా సర్దుకునేవి. ప్రస్తుతం కూడా కోమటిరెడ్డి సోదరులు అలానే తమ స్వరాన్ని పెంచుతుండడంతో పార్టీ సీనియర్లు కూడా లైట్ తీసుకున్నారని సమాచారం. కోమటిరెడ్డి సోదరుల వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ వ్యవహారాల ఇన్చార్జి కేసి వేణుగోపాల్ దృష్టికి భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు తీసుకెళ్లినా మధ్యలో మాణిక్యం ఠాగూర్ అడ్డుపడ్డారని తెలుస్తోంది. పైగా రేవంత్ రెడ్డికి మాణిక్యం ఠాగూర్ కు సత్సంబంధాలు ఉండటంతో కోమటిరెడ్డి సోదరులను దూరం పెడుతున్నారని తెలుస్తోంది. మరోవైపు ఉమ్మడి నల్లగొండలో కోమటిరెడ్డి సోదరులు చెప్పిందే వేదం అవుతుండడంతో వీరిని ఎలాగైనా సాగనంపాలనే నిర్ణయానికి పార్టీ వచ్చినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే వారంతట వారే వెళ్ళిపోయేలాగా పొగ పెట్టారనే వాదనలు లేకపోలేదు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాకతో తమ పార్టీ మరింత బలోపేతం అవుతుందని బిజెపి నేతలు విశ్వసిస్తున్నారు. ఆయన బాటనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుసరిస్తే పార్టీ ఎక్కువగా విస్తరించే అవకాశాలుంటాయని చెప్తున్నారు. మరోవైపు ఉమ్మడి నల్గొండ లోనే పాదయాత్ర నిర్వహిస్తున్న బండి సంజయ్ కుమార్ కూడా మునుగోడు విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇదే సమయంలో మునుగోడు నియోజకవర్గ పరిధిలోని సర్పంచులకు,ఎంపిటిసి లకు, జడ్పిటిసి లకు బిజెపి తాయిళాలు ఇస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం బిజెపిలో చేరుతారనే విషయంపై స్పష్టత లేకపోయినప్పటికీ ఆయన రాక మాత్రం కచ్చితంగా ఉంటుందని కమలనాధులు అంటున్నారు. ఇటు కాంగ్రెస్ అటు బిజెపి పరస్పరం కత్తులు దూసుకుంటున్న వేళ.. మునుగోడు విషయంలో మాత్రం టీఆర్ఎస్ సైలెంట్ గా ఉండటం గమనార్హం.