Komatireddy Venkat Reddy- Pawan Kalyan: తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం కోసం టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఏ చిన్న చాన్స్ మిస్‌కాకుండా చూసుకుంటున్నాయి. మునుగోడు ప్రచార రేస్‌లో ముందు వరుసలో ఉండేలా మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు చూసుకుంటున్నారు. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అయితే ఆ పార్టీ దగ్గర తగినంత ఆర్థిక బలం లేదు. అంగబలం కూడా రెండుగా విడిపోయింది. ప్రచారానికి సొంత పార్టీ నేతలే దూరంగా ఉంటున్నారు.

వ్యతిరేకత లేదని చాటేందుకు..
ఇక టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా జరుగుతున్న ఉప ఎన్నిక ఇది. ఇందులో టీఆర్‌ఎస్‌గానే బరిలో నిలిచినప్పటికీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా బీఆర్‌ఎస్ అయినా.. టీఆర్‌ఎస్ అయినా ఆదరణ తగ్గలేదని నిరూపించుకోవాలని భావిస్తోంది. ఈమేరకు గులాబీ యంత్రాంగం మొత్తాన్ని మునుగోడులో మోహరించారు టీఆర్‌ఎస్ బాస్ కె.చంద్రశేఖర్‌రావు. చివరకు నియోజకవర్గంలోని ఓ గ్రామానికి తానుకూడా ఇన్‌చార్జిగా ఉన్నారంటే టీఆర్‌ఎస్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అర్థమవుతోంది. టీఆర్‌ఎస్‌పై తెలంగాణలో కూడా వ్యతిరేకత చాటాలని గులాబీ నేతలు భావిస్తున్నారు.
బీజేపీ దూకుడు..
ఇక కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజానామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో రాజగోపాల్‌రెడ్డిని గెలిపించేందుకు బీజేపీ కూడా దూకుడు పెంచింది. వాస్తవంగా ఇక్కడ బీజేపీకి బలం తక్కువే. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తోంది. ఈ క్రమంలో కలిసి వచ్చిన ఉప ఎన్నికలో తెగించి కొట్లాడుతోంది. ఆర్థిక ఇబ్బందులు లేకపోవడంతో ఖర్చుకూ వెనుకాడడం లేదు. టీఆర్‌ఎస్‌కు దీటుగానే బీజేపీ కూడా భారీగా డబ్బులు ఖర్చు చేస్తోంది. ఇదే సమయంలో టీఆర్‌ఎస్ సీనియర్ నేత, గౌడ సామాజికి వర్గానికి చెందిన మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ను కాషాయ గూటికి రప్పించింది. గులాబీ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నర్సయ్యగౌడ్ బీజేపీలోకి రావడంతో ఆందోళన చెందిన గులాబీ బాస్.. బీజేపీలోని ముగ్గురు ఉద్యమ నేతలను టీఆర్‌ఎస్‌లోకి రప్పించారు.
కూసుకుంట్లకు కాంగ్రెస్ పరోక్ష మద్దతు..
ఇక సిట్టింగ్ సీటు సాధించడంపై రోజురోజుకూ కాంగ్రెస్ నేతల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. నల్లగొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సొంత పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడానికి రావడం లేదు. పైగా బీజేపీ అభ్యర్థి తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని కాంగ్రెస్ నేతలకు సూచిస్తున్నారు. ఆస్ట్రేలియా వెళ్లి.. మునుగోడులో కాంగ్రెస్ గెలవదని పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇక సీనియర్ నేతలు కూడా ప్రచారానికి దూరంగానే ఉంటున్నారు. దీంతో ఫలితాలను ముందే ఊహించిన టీపీసీసీ బీజేపీ అభ్యర్థిని దెబ్బకొట్టాలని చూస్తోంది. అవసరమైతే టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఓటు వేయాలని అంతర్గతంగా సూచిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌పై గెలిచి, ఇపుపడు రాజీనామా చేసి మళ్లీ బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్న రాజగోపాల్‌రెడ్డి గెలిస్తే కాంగ్రెస్ ఉనికే ప్రశ్నార్థకమవుతంది. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ పరోక్షంగా టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటిస్తోందని తెలిసింది.

జనసేనాని సాయం కోరిన కోమటిరెడ్డి..
ఇక మునుగోడు నియోజకవర్గంలో పరిస్థితులు పూటకో విధంగా మారుతున్నాయి. ఉదయం టీఆర్‌ఎస్‌వైపు ఉన్న ఓటర్లు, సాయంత్రం బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారు. సాయంత్రం బీజేపీ వైపు ఉన్నవారు మళ్లీ ఉదయానికి టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నారు. ఈ పరిస్థితులను సునిశితంగా గమనిస్తున్న బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా తన తమ్ముడిని గెలిపించుకోవాలని చూస్తున్నారు. ఇందు కోసం సొంత పార్టీకే ఆయన వ్యతిరేంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ అవసరమైతే కూసుకుంట్లకు మద్దతు ఇవ్వాలని అంతర్గతంగా ఆదేశాలు ఇవ్వడంతో వెంకట్‌రెడ్డి కూడా అప్రమత్తమయ్యారు. తెలంగాణలో జనసేన మద్దతు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈమేరకు వెంకట్‌రెడ్డి స్వయంగా జనసేనాని పవన్ కళ్యాణ్‌కు ఫోన్ చేసినట్లు సమాచారం. నల్లగొండ జిల్లాలో జన సేనకు మంచి క్యాడర్ ఉంది. ముఖ్యమంగా మునుగోడులో కూడా పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఉన్నారు. దీంతో వారిద్వారా రాజగోపాల్‌రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేయించాలని కోరారు.
రంగంలోకి జన సైనికులు..
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ జనసేన కలిసి పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెంకట్‌రెడ్డి కోరిన వెంటనే బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి మద్దతు ఇవ్వడానికి పవన్ అంగీకరించినట్లు తెలిసింది. ఈమేరకు మునుగోడులో జన సైనికులను రంగంలోకి దించాలని తెలంగాణ ఇన్‌చార్జికి పవన్ ఆదేశించినట్లు సమాచారం. పవన్ ఆదేశాల మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు, హైదరాబాద్ నుంచి కూడా జన సైనికులు మునుగోడు చేరుకున్నట్లు తెలిసింది. దీంతో మునుగోడులో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుందని బీజేపీ నాయకులు కూడా భావిస్తున్నారు.