Kodali Nani: అందితే జుత్తు …లేకుంటే కాళ్లు అన్నట్టుంది కొడాలి నాని వ్యవహార శైలి. మొన్నటికి మొన్న చిరంజీవిపై అవాకులు చవాకులు పేలిన ఆయన… ఇప్పుడు ఏకంగా చిరంజీవి జన్మదిన వేడుకలు జరపడం విశేషం. హీరోల రెమ్యూనరేషన్ల గురించి మాట్లాడుతున్నారని.. అంతకంటే ఏపీకి పనికొచ్చే విషయాలు మాట్లాడవచ్చు అని చిరంజీవి సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ నేతలు ముప్పేట దాడి చేశారు. కొడాలి నాని అయితే ఏకంగా చిరంజీవిని ఉద్దేశించి పకోడీగాళ్లంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడైతే కొడాలి నాని చిరంజీవి జన్మదిన వేడుకలు జరపడం విశేషం. తన అనుచరులని చిరంజీవి ఫ్యాన్స్ గా ముద్ర వేసి వేడుకలు నిర్వహించారు. ఇప్పుడిదే అంతటా హాట్ టాపిక్ గా మారింది. అంతటితో ఆగని నాని తాను చిరంజీవిని ఏమీ అనలేదని చెప్పుకొచ్చారు. రాజకీయంగా చిరంజీవిని విమర్శిస్తే ఏం జరుగుతుందో తనకు తెలుసు అన్నారు. అదే సమయంలో తమ అధినేత జగన్ గురించి, తమ గురించి మాట్లాడితే ఎంతటి వారైనా సహించేది లేదని హెచ్చరించారు. నాడు చిరంజీవి తమకు ఇచ్చిన సలహాలను.. ఇండస్ట్రీలో ఇతర పకోడీ గాళ్ళకి ఇవ్వమని మాత్రమే చెప్పాను అంటూ తన వ్యాఖ్యలను సర్ది చెప్పుకున్నారు. మెగాస్టార్ చిరంజీవికి తనకు మధ్య అగాధాలు సృష్టించడానికి తెలుగుదేశం,జనసేన పార్టీలు ప్రయత్నించాయని ఆరోపించారు.
అయితే కొడాలి నాని వ్యవహార శైలి ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి పై వ్యాఖ్యల తర్వాత కొడాలి నాని ముప్పేట విమర్శలు ఎదుర్కొన్నారు. కాపు సంఘం నేతలు సైతం స్పందించారు. గుడివాడలో ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. గుడివాడ నియోజకవర్గంలో కాపులు అధికం. అటు స్నేహితుడు వంగవీటి రాధాకృష్ణ సైతం టిడిపిలో యాక్టివ్ అవుతున్నారు. ఆయన నుంచి ఈసారి ఎటువంటి సాయం ఉండదు. గుడివాడ నియోజకవర్గంలో కాపులు ఈసారి నానిని వ్యతిరేకించే అవకాశం ఉంది. దీంతో కాపుల్లో తనపై ఉన్న ఆగ్రహాన్ని తగ్గించుకునేందుకు ఇప్పుడు కొత్తగా చిరంజీవి జన్మదినాన్ని కొడాలి నాని ఈ విధంగా వాడుకుంటున్నారు.
తనలాంటి ధైర్యవంతమైన వ్యక్తి ఉండడన్న రీతిలో కొడాలి నాని ప్రవర్తిస్తుంటారు. రాజకీయ ప్రత్యర్థులకు నిత్యం ఒక సవాల్ విసురుతుంటారు. మీకు దమ్ముంటే గుడివాడలో తనపై గెలవాలని పిలుపునిస్తుంటారు. దీంతో రాజకీయంగా అందరికీ టార్గెట్ గా మారారు. చాలా వర్గాలు దూరమయ్యాయి. మొన్నటి చిరంజీవి ఎపిసోడ్లో కాపు వర్గం పూర్తిగా వ్యతిరేకంగా మారింది. అందుకే సిగ్గు లేదన్నట్టు.. చిరంజీవి జన్మదిన వేడుకలకు హాజరయ్యారంటూ కొడాలి నాని పై సెటైర్లు పడుతున్నాయి.