బీజేపీలో వర్గపోరు నడుస్తోంది. పార్టీ రెండు వర్గాలుగా విడిపోయి తమ ఆధిపత్యం కోసం పోరాడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఈనెల 9నుంచి పాదయాత్ర చేపట్టాలని ఆశించినా అది నెరవేరడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి సైతం ఈనెల 16నుంచి జన ఆశీర్వాద్ యాత్ర చేపట్టేందుకు నిర్ణయించుకున్నారు. దీనికి ఎంపీలు కూడా హాజరు కావాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేయడంతో సంజయ్ పాదయాత్ర వాయిదా పడనుంది. జన ఆశీర్వాద్ యాత్ర అధిష్టానం నిర్ణయంతోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది.
జన ఆశీర్వాద్ యాత్ర ఈనెల 16 నుంచి మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఇందులో భాగంగా ఒక్కో కేంద్రమంత్రి మూడు, నాలుగు లోక్ సభ నియోజకవర్గాలను కవర్ చేస్తూ పర్యటన చేయనున్నారు. దీనికి బీజేపీ ఎంపీలు అందరు అందుబాటులో ఉండాలని అధిష్టానం ఆదేశించింది. దీంతో కిషన్ రెడ్డి పాదయాత్రకు సంజయ్ హాజరు కావాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో సంజయ్ కు మరో మార్గం లేకుండా పోవడంతో పాదయాత్రను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన బండి సంజయ్ కు సహజంగా ఇమేజ్ పెరిగింది. దీంతో బీజేపీలోని కొందరు నాయకులకు ఇది నచ్చలేదు. ఆయన స్థాయిని తగ్గించాలనే ఉద్దేశంతో ఇమేజ్ తగ్గించేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక అప్పటి నుంచి ఏం చేద్దామన్నా సహకరించడం లేదు. పాదయాత్రను కూడా ఇదే కోవలో ముందుకు సాగనివ్వలేదనే ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా బండి సంజయ్ ప్రాబల్యాన్ని సాధ్యమైనంతవరకు తగ్గించి ఆయనకు జనాదరణ లేకుండా చేయడమేనని చెబుతున్నారు.
ఇక కిషన్ రెడ్డి పాదయాత్ర ఉండడంతో సంజయ్ తన పాదయాత్రను వాయిదా వేసుకోక తప్పడం లేదు. కానీ ఆయన ప్రారంభించదలుచుకున్న పాదయాత్ర ఈనెల 26న ప్రారంభిస్తానని చెబుతున్నా అది కూడా ఆచరణ సాధ్యం కాదని తెలుస్తోంది. సొంత పార్టీ నేతలే ఆయన పనులకు అడ్డంకులు సృష్టించడంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. పార్టీలో తన ఎదుగుదల ఉండకూడదనే సాకుతో ప్రతి పనికి ఎదురు తిరగడంతో పార్టీకే నష్టాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.