Kishan Reddy: తెలంగాణలో మళ్లీ పొలిటికల్ హీట్ మొదలైంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల వరకు దూకుడు మీద ఉన్న బీజేపీ ఆ తర్వాత పూర్తిగా రేసు నుంచి తప్పుకున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో పార్టీలో అంతర్గత కలహాలు, నేతల బహిరంగ వ్యాఖ్యలు అధ్యక్షుడి మార్పు తదితర పరిణామాలతో పార్టీ గ్రాఫ్ క్రమంగా పడిపోయింది. ఈ క్రమంలో టీబీజేపీ ప్రక్షాళణకు అధిష్టానం శ్రీకారం చుట్టింది. అధ్యక్షుడితోపాటు ఇన్‌చార్జీలను కూడా మార్చింది. టీబీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో కిషన్‌రెడ్డిని నియమించింది. ఇన్‌చార్జిగా తరుణ్‌చుగ్ స్థానంలో ప్రకాశ్‌జయదేకర్, సునీల్ బన్సల్‌ను నియమించింది. ఇదే సమయంలో ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో వంద రోజుల ప్రణాళికతో దూకుడు పెంచాలని భావిస్తోంది.
బీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేలా..
తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేలా పార్టీలో దూకుడు పెంచేందుకు కొత్త అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జీలు, జాతీయ నాయకత్వం కూడా వ్యూహాలు చరిస్తున్నాయి. అందులో భాగంగానే పార్టీలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని కూడా భావిస్తోంది. ఈ క్రమంలో మార్పులకు సంబంధించి కొత్త అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి జాతీయ నాయకత్వం పూర్తి ధికారం ఇచ్చింది. దీంతో స్టేట్ యూనిట్‌లో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎవరిని మారుస్తారు? ఎంతమం దీని మారుస్తారనే అంశంపై పార్టీలో చర్చ జరుగుతోంది. మరోవైపు ప్రస్తుతం కొనసాగుతున్న టీంను ఇలాగే కంటిన్యూ చేస్తూ కొత్తవారిని కమిటీలోకి చేర్చుకునే ప్రతిపాదన కూడా ఉన్నట్లు సమాచారం.
పార్టీని గాడిన పెట్టేలా..
ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని కూడా గాడిన పెట్టాలని కిషన్‌రెడ్డి భావిస్తున్నారు. ఇందుకు కొన్ని మార్పులు, చేర్పులు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. నోవాటెల్లో నడ్డా నిర్వహించిన కోర్ కమిటీ మీటింగ్ అనంతరం కిషన్‌రెడ్డి ఆయనతో ఈ విషయంపై చర్చించినట్టు తెలుస్తుంది. ఈ అంశంపై కిషన్ రెడ్డికి నడ్డా పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్టు టాక్.
మోర్చాల బలోపేతం.. స్పోక్స్ పర్సన్ల మార్పు..
టీబీజేపీ అనుబంధ విభాగమైన పలు మోర్చాలు యాక్టివ్ లేవు. అందుకే వాటిని బలోపేతం చేయాలని కిషన్‌రెడ్డి ఆలోచిస్తున్నారు. ఇందు కోసం అవసమైన కొన్ని మోర్చాల అధ్యక్షులను మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక పార్టీ అధికార ప్రతినిధులను కూడా మార్చాలని భావిస్తున్నట్లు తెలిసింది. కానీ, వేటు ఎవరిపై పడనుందనేది సస్పెన్స్‌గా మారింది.
ప్రయోగాలు వద్దనుకుంటే..
ఎన్నికలకు సమయం తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రయోగాలు చేయడం ఎందుకని భావిస్తే పాత టీంను అలాగే కొనసాగిస్తూ కొత్త వ్యక్తులను అందులో చేర్చుకునే చాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రధాన కార్యదర్శుల మార్పునకు సంబంధించిన అంశంపై తర్జనభర్జన కొనసాగుతున్నట్లు సమాచారం. టీంను మారిస్తే ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే ఆలోచనలో కిషన్‌రెడ్డి ఉన్నట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు. మొత్తానికి మార్పులు జరిగితే కిషన్‌రెడ్డి ఎవరిని అందలం ఎక్కిస్తారు? ఎవరికి మొండిచేయి చూపి స్తారనేది పార్టీలో చర్చ జరుగుతోంది.