Kishan Reddy- Pawan Kalyan: తెలంగాణలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి.ఎ న్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని రాజకీయ పార్టీలు అస్త్ర శాస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నాయి. ఇప్పటికే అధికార బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దూసుకెళ్తున్నాయి. ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించాయి. ఈ పరిస్థితుల్లో బిజెపి సైతం వ్యూహం మార్చింది. గెలుపునకు ఉన్న ఏ అవకాశాలను జారవిడుచుకోవడం లేదు. తాజాగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ ప్రత్యేకంగా కలుసుకొని చర్చలు జరపడం విశేషం.
ఇప్పటికే జనసేన తెలంగాణ ఎన్నికల్లో 32 మంది అభ్యర్థులను బరిలో దించునున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ నగరం తో పాటు సెటిలర్స్ అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో బిజెపి నేతలు నేరుగా పవన్ కార్యాలయానికి వచ్చి చర్చలు జరపడం విశేషం. ఇప్పటికే జనసేన ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉంది. తెలంగాణలో కలిసి పోటీ చేయడంపై పవన్ తో వారు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ జనసేన నేతల మనోగతాన్ని పవన్ వారికి వివరించారు.
జనసేన ఆవిర్భావం నుంచి తాము వ్యవహరించిన తీరు గురించి పవన్ ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం, బిజెపి అభ్యర్థుల గెలుపునకు కృషి చేసినట్లు వివరించారు. బిజెపి అగ్ర నాయకుల కోరిక మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల నుంచి విరమించుకుని బిజెపి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన వైనాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కనీసం 30 స్థానాల్లో అయినా పోటీ చేయకపోతే కార్యకర్తల ధైర్యం దెబ్బతింటుందని తెలంగాణ జనసేన నాయకులు చెబుతున్న విషయాన్ని బిజెపి నేతలకు వివరించే ప్రయత్నం చేశారు పవన్.
ఇప్పటికే బీజేపీకి మద్దతు విషయంలో తెలంగాణ జనసేన నాయకులు స్పష్టమైన వైఖరితో ఉన్నారు. పొత్తుతో ముందుకు సాగుతామంటే ఓకే కానీ.. మద్దతు విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని పవన్ కు వారు సూచించారు. అందుకే పవన్ ఏ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఉమ్మడిగా పోటీ చేసే విషయమై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కలిసి పోటీ చేస్తే.. ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు? జనసేనకు బిజెపి ఎన్ని సీట్లు కేటాయిస్తుంది? పొత్తుపై జనసేన అధినేత నిర్ణయం ఎలా ఉండనుంది? అనే విషయాలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారాయి.