Kiran Kumar Reddy: రాయలసీమ కోసమే కిరణ్ కుమార్ రెడ్డి.. బీజేపీ పెద్ద ప్లాన్

Kiran Kumar Reddy: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పొలిటికల్ గేమ్ ప్లే చేస్తోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో బలపడే ఉద్దేశంతో ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో చేరికలకు బిజెపి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవడం వెనుక ఈ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యం ఉన్నట్టు చెబుతున్నారు. రానున్న రోజుల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని […]

Written By: BS, Updated On : April 8, 2023 12:43 pm
Follow us on

Kiran Kumar Reddy

Kiran Kumar Reddy: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పొలిటికల్ గేమ్ ప్లే చేస్తోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో బలపడే ఉద్దేశంతో ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో చేరికలకు బిజెపి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవడం వెనుక ఈ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యం ఉన్నట్టు చెబుతున్నారు. రానున్న రోజుల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని పార్టీలో చేర్చుకోవడమే బిజెపి లక్ష్యంగా కనిపిస్తోంది.

దక్షిణాది రాష్ట్రాల్లో బలం పుంజుకోవాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ఆ దిశగా కలిసివచ్చే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పటికే కర్ణాటకలో అధికారంలో ఉన్న బిజెపి మరోసారి అక్కడ పాగా వేసేందుకు సిద్ధమవుతోంది. దక్షిణాదిలో కీలక రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పై బీజేపీ ముఖ్య నాయకులు దృష్టి సారించారు. తెలంగాణలో ఇప్పటికే బలమైన పార్టీగా బిజెపి అవతరించింది. వచ్చే ఎన్నికల్లో అధికార బిఆర్ఎస్ కు గట్టి పోటీ భారతీయ జనతా పార్టీ నుంచి ఎదురవుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ బీజేపీ బలం పుంజుకోలేదు. ఇక్కడ ఆ పార్టీలో ముఖ్యమైన నాయకులు లేకపోవడం సమస్యగా మారుతోంది. దీంతో రాష్ట్రంలోని వివిధ పార్టీల్లో ఉన్న ముఖ్య నాయకులను బిజెపిలోకి ఆహ్వానించడం ద్వారా బలం పుంజుకోవాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని తాజాగా బిజెపిలో చేర్చుకున్నారు.

రాయలసీమలో బిజేపి గేమ్ ప్లాన్..

భారతీయ జనతా పార్టీ ప్రప్రదమ లక్ష్యం రాయలసీమ ప్రాంతంలో విస్తరించడం. ఆ ఉద్దేశంతోనే రాయలసీమకు చెందిన పలువురు కీలక నాయకులను బిజెపిలో చేర్చుకోవాలని ఆ పార్టీ అగ్రనాయకత్వం భావించింది. అందుకు అనుగుణంగానే మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ కండువా కప్పింది. ఈయనతో పాటు మరికొంతమంది టిడిపి, వైసిపి లో ఉన్న ముఖ్య నాయకులు బిజెపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో విష్ణువర్ధన్ రెడ్డి, భాను ప్రకాశ్ రెడ్డి లాంటి ఒకరిద్దరు తప్పితే పార్టీలో రెడ్డి సామాజిక వర్గం నేతలు పెద్దగా లేరు. వైసీపీ మాత్రమే రెడ్డి పార్టీ అన్న పేరు పడిపోయింది. దీంతో రాయలసీమలో బలపడేందుకు రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవాలన్న ఉద్దేశంలో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నట్లు చెబుతున్నారు. పైగా కాంగ్రెస్ పార్టీలో ఇక మనుగడ ఉండదని రాష్ట్రంలో ఆ పార్టీ మళ్లీ పుంజుకోవడం కుదరదని గ్రహించిన కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరేందుకు అంగీకరించినట్లు చెబుతున్నారు.

కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసిన కిరణ్ కుమార్ రెడ్డి..

పార్టీ మారుతున్న క్రమంలో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ నాయకులను ఏమాత్రం పట్టించుకోదని, వారి అభిప్రాయాలకు గౌరవం ఇవ్వదని ఆరోపించారు. ప్రజలతో మాట్లాడని పార్టీ కాంగ్రెస్ ఒకటేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అన్ని రాష్ట్రాలను కోల్పోతుండగా యువత ఆదరణ పొందుతున్న బిజెపి ఒక్కో రాష్ట్రాన్ని హస్తగతం చేసుకుంటుందని వెల్లడించారు. కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై ఏపీసీసీ ప్రెసిడెంట్ రుద్రరాజు ఘాటుగానే స్పందించారు. ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్ పార్టీని వదిలి కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలోకి వెళ్లారంటూ విమర్శించారు. త్యాగాలకు మారుపేరైన కాంగ్రెస్ను విమర్శించే హక్కు కిరణ్ కుమార్ రెడ్డికి లేదని స్పష్టం చేశారు. ఇకపోతే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరిక సందర్భంగా రాష్ట్రానికి చెందిన బిజెపి నేతలు ఎవరూ లేకపోవడం గమనార్హం. కర్ణాటక కు చెందిన బిజెపి నాయకులు ద్వారా ఆయన పార్టీలో చేరినట్లు చెబుతున్నారు.

Kiran Kumar Reddy

రాజ్యసభకు పంపించే అవకాశం..

కిరణ్ కుమార్ రెడ్డిని రాజ్యసభకు పంపించే ప్రతిపాదనతోనే పార్టీలో చేర్పించుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో బిజేపి తరపున ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి పార్టీని బలోపేతం చేయాలంటే తనకు సరైన పదవి ఇవ్వాలని కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన ప్రతిపాదనను బిజెపి అగ్రనాయకత్వం అంగీకరించింది. అందుకు అనుగుణంగానే త్వరలో ఉత్తరప్రదేశ్ లేదా మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఆయనను ఎంపిక చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.