YCP- RGV: ఆర్జీవీ.. ఈయన పేరు తెలియనివారు ఎవరూ ఉండరు. ఎన్నో మంచి సినిమాలు తీసి బాలీవుడ్ స్థాయికి ఎదిగిన తెలుగు దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. కానీ ఇటీవల తరచూ వివాదాల్లో ఉంటున్నారు. వివాదాస్పద సినిమా దర్శకుడిగా ముద్ర పడ్డాడు. వివాదాలు చేయడమే తన పని అన్నట్లుగా ప్రతీ వివాదాన్ని సమర్థించుకుంటారు. తాజాగా ఆర్జీవీ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల సమయంలో జగన్ అధికారంలోకి రావడానికి పరోక్షంగా సహకరించారు జగన్. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ద్వారా నాటి అధికార పార్టీపై ప్రజల్లో ద్వేషం పెంచారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను కళ్లకు కట్టేలా తెరకెక్కించారు. చంద్రబాబు నాయకుడు కొడుకు లోకేష్‌ను పప్పు ముద్దగా చూపించి సఫలమయ్యారు.

వైసీపీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ..
ఐదేళ్లుగా ఆంధ్రా రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ.. తాజాగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు. ఇందుకోసం ప్రస్తుత అధికార పార్టీ వైసీపీనే మంచి వేదిక అని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలనే ఆయన ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలిసినట్లు తెలుస్తోంది. హఠాత్తుగా తాడేపల్లిలో ప్రత్యక్షమైన ఆయన సీఎం జగన్‌తో లంచ్ మీటింగ్‌లో పాల్గొన్నట్లుగా చెబుతున్నారు.
ఆర్జీవీతో మీటింగ్‌పై గోప్యత..
వివాదాస్పద దర్శకుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌తో భేటీ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో సినిమా టికెట్ల ధరల పెంపు.. తగ్గింపు.. విషయంలో ట్విట్టర్ వేదికగా.. వర్మ ఏపీ సర్కారుపై కొన్ని కామెంట్లు చేశారు. అదే సమయంలో అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రిపేర్ని నానితో ఆర్జీవీ భేటీ అయ్యారు. సినిమా టికెట్లపై చర్చించారు కూడా. కట్ చేస్తే.. ఇప్పుడు.. మరోసారి వర్మ తాడేపల్లిలో ప్రత్యక్షమయ్యారు. సీఎం జగ¯Œ ను కలిసేందుకు ఆయన క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. అరగంటకుపైగా జగన్, రాంగోపాల్ వర్మ మధ్య సమావేశం జరిగినట్లు చెబుతున్నారు. ఆర్జీవీతో సీఎం జగన్ సమావేశంపై సమాచారాన్ని అధికార పార్టీ గోప్యంగా ఉంచింది. అధికారికమైన భేటీ కాదని.. సీఎం హోదాలో కాకుండా వైఎస్‌ఆర్సీపీ అధ్యక్షుడి హాోదాలోనే ఆర్జీవీతో జగన్ సమావేశమయ్యారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రచారం కోసం ఆర్జీవీ ఆలోచనలను ఉపయోగించుకోవాలని సీఎం జగన్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
వైసీపీకి మేలు చేసేలా.. ఆర్జీవీ సినిమాలు
గత ఎన్నికలకు ముందు రామ్‌గోపాల్ వర్మ వైఎస్‌ఆర్‌సీపీకి ఎంతో మేలు చేశారు. ఆ పార్టీ నేతలు నిర్మాతలుగా వ్యవహరించడంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీశారు. ఆ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడనప్పటికీ.. విడుదలకు ముందు రాజకీయంగా ఎంత చర్చ జరగాలో అంతా జరిగింది. సినిమా మాధ్యమం ద్వారా జరిగే ప్రచారం ప్రభావవంతంగా ఉంటుందని వైఎస్ఆర్సీపీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల ముందు కూడా ఇలాంటి కొన్ని సినిమాలను ప్లాన్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నారని అందుకే ఆర్జీవీని పిలిపించి మాట్లాడారని చెబుతున్నారు.
పవన్‌ను ఎదుర్కొనేందుకే..
గత కొంతకాలంగా వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. వైసీపీకి సినీగ్లామర్ లేదు. అందువల్ల వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మతో పవన్‌ను ధీటుగా ఎదుర్కొనవచ్చనే ఉద్దేశం జగన్‌కు ఉన్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగా ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. మొదటి నుంచి టీడీపీకి సినీగ్లామర్ ఉంది. ఆ తర్వాత వైసీపీలోనూ సినీ నటులు చేరారు. ఏమైందోఏమోగానీ వైసీపీలో ఉన్న సినీ నటులు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. ప్రస్తుతం సినీ పరిశ్రమకు చెందిన వాళ్లు అతి తక్కువ మంది మాత్రమే వైసీపీలో కొనసాగుతున్నారు. ఆ మధ్య చిరంజీవిని రాజ్యసభకు పంపుతారని లీకులిచ్చారు. అయితే ఆయన ఆ ప్రచారాన్ని ఖండించారు. సినీ గ్లామర్ ఉంటే ఓట్లు పడతాయనే భావనలో వైసీపీ నేతలున్నారు. అందువల్ల రాంగోపాల్ వర్మతో జగన్ సమావేశమయ్యారని అంటున్నారు.

మూడు సినిమాలకు ప్లాన్..
2024 నాటికి ఆర్జీవీతో మూడు సినిమాలు తీయించాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఎన్నికల్లో అధికార పార్టీకి మేలు కలిగేలా ఈ సినిమాలు ఉండాలని ఆలోచన చేస్తున్నట్లుగా వైఎస్‌ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం – జనసేన పొత్తులు పెట్టుకునే అవకాశాలున్నాయి. ఆ పొత్తును టార్గెట్ చేస్తూ ఉండేలా ఓ సినిమా రూపొందించనున్నట్లుగా చెబుతున్నారు. గతంలో ఆర్జీవీ వంగవీటి అనే సినిమాను తీశారు. కానీ పెద్దగా ఆడలేదు. ఆ సినిమా సమయంలో వంగవీటి తనయుడు రాధాకృష్ణతో వివాదం తెచ్చుకున్నారు. ఆయనపై విమర్శలు చేశారు. అలాగే పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయంలోనూ ప్రజలకు మరింతగా చెప్పాలని.. అది ఆర్జీవీ అయితేనే బెటర్‌గా ఉంటుందని వైఎస్ఆర్సీపీ పెద్దలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పవన్ మూడు పెళ్లిళ్ల అంశంపై వైఎస్‌ఆర్‌సీపీ నేతలు విసృ›్తతంగా విమర్శలు చేస్తోంది. దానికి కొనసాగింపుగా సినిమా తీయాలని భావిస్తోంది అధికార పార్టీ. ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌పై కూడా మరో సినిమా తీసేందుకు రామ్‌గోపాల్ వర్మ ప్రతిపాదించారు. ఈ సినిమాకు రాయలసీమకు చెందిన ఓ ఎంపీ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. జగన్నాథ రథచక్రాలు అని ఈ సినిమాకు టైటిల్ కూడా ఖరారు చేశారు. 2024 ఎన్నికలకు ముందు ఈ సినిమా విడాదలయ్యేలా ఈ సినిమా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.
సోషల్ మీడియా బాధ్యతలు ఆయనకే..
ప్రస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియా కూడా కీలకంగా మారింది. ప్రస్తుతం ఏపీలో వైసీపీ సోషల్ మీడియాను బలోపేతం చేయాలని కూడా అధికార పార్టీ భావిస్తోంది. ఇందుకు క్రియేటివ్, వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ ఇన్‌చార్జిగా ఉంటే మేలని కొంతమంది వైసీపీ నేతలు జగన్‌కు సూచించినట్లు తెలిసింది. రాజకీయాల్లోకి రావాలని చూస్తున్న ఆర్జీవీని వైసీపీలో చేర్చుకుని సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీకి అదనపు బలం చేకూరుతుందని, 2024 ఎన్నికల్లో లాభం జరుగుందనే ఆలోచనలో వైసీపీ అధినేత ఉన్నట్లు సమాచారం. అదే నిజమైతే.. టీడీపీ, జనసేనను టార్గెట్‌గానే వైసీపీ ఆర్జీవీ ద్వారా రాజకీయాలు చేయాలని భావిస్తోంది.