Pakistan Politics: సంక్షోభ పాకిస్థాన్ లో సంచలనం.. ప్రధాని అభ్యర్థిగా అతడు

నవాజ్ షరీఫ్ నేతృత్వం లోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ ( పీఎంఎల్ _ ఎన్) పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా షహబాజ్ షరీఫ్(72) ను నామినేట్ చేసింది.

Written By: Suresh, Updated On : February 14, 2024 4:24 pm

Pakistan Politics

Follow us on

Pakistan Politics: ఎన్నికలకు ముందు నవాజ్ షరీఫ్ అధ్యక్షుడు అవుతారని అన్నారు.. కొంతకాలానికి ఇమ్రాన్ ఖాన్ అయ్యే అవకాశం లేకపోలేదన్నారు. ఎన్నికలు నిర్వహించి.. ఫలితాలు వెల్లడించేందుకు చాలా సమయమే తీసుకున్నారు. “మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని” జైలు నుంచి ఇమ్రాన్ ఖాన్ ఏఐ ద్వారా రూపొందించిన ఒక సందేశాన్ని పంపారు. “లేదు లేదు మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని” నవాజ్ షరీఫ్ అన్నారు. కానీ తీరా ఫలితాలు వచ్చిన తర్వాత పాకిస్థాన్ లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.

నవాజ్ షరీఫ్ నేతృత్వం లోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ ( పీఎంఎల్ _ ఎన్) పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా షహబాజ్ షరీఫ్(72) ను నామినేట్ చేసింది. దీంతో షహబాజ్ షరీఫ్ మరోసారి పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. వాస్తవానికి అందరూ నవాజ్ షరీఫ్ నాలుగోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని అందరూ ఊహించారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఈ నిర్ణయం వెలువడింది.. ఈ మేరకు వివరాలను ట్విట్టర్ ఎక్స్ లో పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ ( పీఎంఎల్ _ ఎన్) పార్టీ అధికార ప్రతినిధి మరియం ఔరంగజేబు వెల్లడించారు. తమ పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ తన సోదరుడు షరీఫ్ ను ప్రధానమంత్రి పదవికి ఎంపిక చేశారని పేర్కొన్నారు. షరీఫ్ కూతురు మరియం నవాజ్ (50) ను పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేశారని వెల్లడించారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ ( పీఎంఎల్ _ ఎన్) ఆధ్వర్యంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కారణమైన అన్ని పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి నిర్ణయాల వల్ల పాకిస్థాన్ దేశం సంక్షోభాల నుంచి బయట పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

వాస్తవానికి పాక్ జాతీయ అసెంబ్లీలో ఎవరికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్పష్టమైన స్థానాలు రాలేదు. దీంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైంది. పాక్ దేశంలో సైనిక అండదండలు ఉన్న వారికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం ఉంటుంది..పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ ( పీఎంఎల్ _ ఎన్) పార్టీకి అక్కడ సైన్యం అండదండలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ ( పీఎంఎల్ _ ఎన్) పార్టీ బిలావల్ భుట్టో జర్దారి నాయకత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీతో సంప్రదింపులు జరిపింది. బిలాల్ భుట్టో ప్రధానమంత్రి పదవిని ఆశిస్తున్నారని ప్రకటించారు. దీంతో ఇరు పార్టీలు ప్రధానమంత్రి పదవిని పంచుకోవాలని యోచిస్తున్నాయని అక్కడ మీడియా కోడై కోసింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ పాకిస్థాన్ ప్రధానమంత్రి రేసు నుంచి వైదొలుగుతున్నట్టు భుట్టో ప్రకటించారు.పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ ( పీఎంఎల్ _ ఎన్) అభ్యర్థికి తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. నవాజ్ షరీఫ్ ప్రధానమంత్రి కావడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఆయన తన తమ్ముడిని ప్రధాన మంత్రిగా ప్రకటించారు. 265 స్థానాలు ఉన్న పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ సారథ్యం వహిస్తున్న పాకిస్థాన్ తెహ్రికే ఇన్సాఫ్ పార్టీ నుంచి స్వతంత్రులుగా పోటీ చేసిన అభ్యర్థులు 101 స్థానాల నుంచి గెలుపొందారు. పీఎంఎల్_ ఎన్ 75, పీపీపీ 54 స్థానాల్లో విజయం సాధించింది.