Loksatta JP : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి తన మద్దతు ప్రకటించారు. అధికార వైసిపి ఒంటరిగా బరిలో దిగుతుండగా.. టిడిపి, బిజెపి, జనసేన కూటమి కట్టాయి. కాంగ్రెస్ పార్టీ సైతం సర్వశక్తులు ఒడ్డుతోంది. గత వైభవం దిశగా అడుగులు వేస్తోంది. జాతీయస్థాయిలో ఇండియా కూటమిలో కీలక భాగస్వామ్యులైన వామపక్షాలతో సీట్ల సర్దుబాటు చేసుకోనుంది. దీంతో త్రిముఖ పోరు నెలకొనే అవకాశం ఉంది. అయితే వైసిపి కూటమి అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. ఈ తరుణంలో లోక్ సత్తా ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించింది.
జయప్రకాష్ నారాయణ లోక్ సత్తా ఉద్యమ సంస్థను ప్రారంభించారు. తరువాత ఆ వేదికను రాజకీయ పార్టీగా మార్చారు. 2009 ఎన్నికల్లోఆ పార్టీ బరిలో దిగింది. ఉమ్మడి రాష్ట్రంలో రెండు శాతం ఓట్లు సాధించింది. 2009 ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి జయప్రకాష్ నారాయణ గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను దించారు. కానీ జేపీ ఒక్కరే గెలుపొందారు. 2014 ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి జెపి పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. ఏకంగా నాలుగో స్థానంలో నిలిచారు. అప్పటినుంచి రాజకీయాలకు స్వస్తి పలికారు. అప్పటినుంచి సమకాలిన రాజకీయ అంశాలపై స్పందిస్తూ వస్తున్నారు. మీడియాతో పాటు సోషల్ మీడియా చర్చల్లో సైతం విస్తృతంగా పాల్గొంటున్నారు.
ఈ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ దానికి చెక్ చెబుతూ ఎన్ డి ఏ కు ఆయన మద్దతు ప్రకటించడం విశేషం.బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయా? అన్న అనుమానం కలుగుతోందన్నారు.’ ప్రతి ఒక్కరూ ఓటు హక్కువినియోగించుకుంటారా?అనే సందేహం ఉంది. నిర్భయంగా నమ్మిన వారికి ఓటు వేయండి. సామాన్యుల జీవితాలు మారాలంటే అభివృద్ధి చూసి ఓటెయ్యాలి. సంక్షేమం, అభివృద్ధి సమతూకం పాటించాలి. ఆర్థిక భవిష్యత్తు కాపాడేవారు ఎవరని ఆలోచించాలి. ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని నేతలు ఆడుకుంటున్నారు’ అని జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు. మొత్తానికైతే దూకుడు మీద ఉన్న ఎన్డీఏకు మరో రాజకీయ పక్షం మద్దతు తెలపడం విశేషం.