
Kethireddy Vs Paritala Sriram: ప్రశాంతమైన ధర్మవరంలో మాటల యద్ధం మొదలైంది. అధికార, ప్రతిపక్షాల ఆరోపణలు ప్రత్యారోపణలతో వాతావరణం వేడెక్కింది. సమాధుల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. సున్నితమైన అంశం కావడంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన జనంలో ప్రారంభమైంది. ఇంతకీ ధర్మవరంలో ఏం జరుగుతోంది ? అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధానికి కారణమేంటి ? స‌్టోరీలో తెలుసుకోండి.
ధర్మవరం చరిత్ర మొత్తం గాయాల చరిత్రే. ఫ్యాక్షన్ రాజకీయాలకు ఒకనాడు పెట్టింది పేరు. వందలాది మంది ఫ్యాక్షన్ కోరల్లో నలిగిపోయారు. కాలక్రమంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. ప్రజలు ఫ్యాక్షన్ కు, ఫ్యాక్షనిస్టులకు దూరం జరిగారు. ప్రజాస్వామిక వాతావరణం నెలకొంది. కానీ ఇప్పుడు కొత్త రాజకీయం మొదలైంది. సమాధుల చుట్టూ రాజకీయం జరుగుతోంది. వైసీపీ, టీడీపీ నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో మానుతున్న గాయాలను మళ్లీ కెలుకుతున్నారు.
ధర్మవరంలో ముస్లిం ఖబరస్థాన్ లో సమాధాలను కొందరు తొలగించారు. దీని పై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి తెలియకుండా ఇది జరగలేదని ఆరోపించారు. వెంటనే కేతిరెడ్డి స్పందించారు. ముస్లిం మత పెద్దల నిర్ణయం మేరకే ఖబరస్థాన్ లోని సమాధులను తొలగించినట్టు చెప్పారు. తన ప్రమేయం ఇందులో లేదని తేల్చిచెప్పారు. అంతటితో సమస్య సద్దుమణిగిందని అందరూ అనుకున్నారు. అయితే.. తాజాగా కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
సోషల్ మీడియాలో సమాధుల అంశం పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని కోతిరెడ్డి పోలీసులను కోరారు. పట్టణంలోని మసీదు కమిటీలన్ని కలిసి నిర్ణయం తీసుకోవాలని, ఇందులో తన ప్రమేయం ఉండదని ఆయన తేల్చారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. దీనిపై పరిటాల శ్రీరామ్ ఫైర్ అయ్యారు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే.. ఎమ్మెల్యే భుజాలు తడుముకుంటున్నారని పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. నెలరోజుల క్రితం జరిగిన ఘటన పై ఎమ్మెల్యే ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. సమస్య పరిష్కారం అవుతోందనుకున్న సమయంలో ఎమ్మెల్యే చిచ్చుపెట్టారని ఆరోపించారు. ఖబరస్థాన్ విషయంలో ఎమ్మెల్యే పాత్ర లేకుంటే విజయవాడ నుంచి అంత హడావుడిగా ఎందుకొచ్చారని ప్రశ్నించారు.

ఖబరస్థాన్ విషయంలో మసీదు కమిటీలన్నీ కలిసి నిర్ణయం తీసుకోవాలని తాను మొదటి నుంచి చెబుతున్నట్టు శ్రీరామ్ తెలిపాడు. వైసీపీ ప్రజావ్యతిరేక నిర్ణయం తీసుకుంటే టీడీపీ తక్షణం స్పందిస్తుందని తెలిపారు. రెండు పార్టీల నడుమ ధర్మవరం ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముస్లిం సమాధుల అంశం సున్నితం కావడంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం ఆవహించింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు మతపరమైన అంశాల్లో జోక్యం చేసుకోకుండా .. సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
