Amaravati Capital Issue: అమరావతి రాజధాని ఇష్యూ ఇప్పట్లో కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తొలుత హైకోర్టులో కేసు విచారణ జరిగే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం కోరుకోగా.. ఇప్పుడు సుప్రిం కోర్టులో జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు. జనవరి 31న అమరావతిపై తుది తీర్పు వెలువడుతుందని అంతా భావించారు. తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు అమరావతి రైతులు ఎవరికి వారు ఆశాభావం వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే అత్యున్నత న్యాయస్థానం కేసు విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. దీంతో ఈ కేసు విచారణ ఇప్పట్లో కొలిక్కి వచ్చే పరిస్థితులైతే కనిపించడం లేదు.

వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న నాటి నుంచి అమరావతి రైతులు పోరాటబాట పట్టారు. ఒక్క వైసీపీ మినహాయించి అన్ని రాజకీయ పక్షాలు అమరాతికే మద్దతు తెలిపాయి. దీంతో అమరావతి రైతుల ఉద్యమం పతాక స్థాయికి వెళ్లింది. హైకోర్టులో సుదీర్ఘ కాలం విచారణ సాగింది. చివరకు హైకోర్టు సైతం అమరావతి రైతులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే ఈ పరిణామ క్రమంలో హైకోర్టులో కేసు విచారణలో రాష్ట్ర ప్రభుత్వం కావాలనే జాప్యం చేసిందన్న వార్తలు వచ్చాయి. ఎప్పుడైతే హైకోర్టులో ప్రతికూల తీర్పు వచ్చిందో దానిని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రిం కోర్టులో పిటీషన్లు దాఖలు చేసింది. దీంతో సుప్రిం కోర్టులో విచారణ ప్రారంభమైంది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. కానీ తుది తీర్పు వెల్లడించలేదు. విచారణ కొనసాగించనున్నట్టు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది నిరంజన్ రెడ్డి కేసును వీలైనంత త్వరగా తేల్చాలని సుప్రింకోర్టుకు విన్నవించారు. దీంతో జనవరి 31న తీర్పు తప్పకుండా వస్తుందని అంతా భావించారు. కానీ ఇంతలో అమరావతి రైతులు తమకు జనవరి 27 నోటీసులు అందాయని.. పూర్తిస్థాయి వివరాలు కోర్టుకు దాఖలు చేయడానికి కనీసం మూడు వారాల వ్యవధి కావాలని కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో కేసు విచారణను ఫిబ్రవరి 23కు వాయిదా వేస్తూ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో అమరావతి రాజధాని తీర్పుపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. మరికొన్నిరోజులు వేచిచూడక తప్పడం లేదు.

వాస్తవానికి కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందని భావించిన జగన్ సర్కారు విశాఖ నుంచి పాలన సాగించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించింది. ఉగాదికి అటు ఇటుగా సీఎం విశాఖ క్యాంప్ ఆఫీసు నుంచి పాలన ప్రారంభిస్తారని మంత్రులు, వైసీపీ కీలక నేతలు ప్రకటనలు ఇస్తూ వచ్చారు. మంత్రులు క్యాంప్ ఆఫీసులను సిద్ధం చేసుకోవాలని సైతం అంతర్గతంగా ఆదేశాలు జారీ అయ్యాయి. కోర్టు పరిధిలో కేసు ఉన్నందున కేవలం సీఎం క్యాంప్ ఆఫీసు పేరిట ప్రకటన ఇస్తూ వచ్చారు. కోర్టు అనుకూలంగా తీర్పు ఇస్తే మాత్రం సచివాలయం తరలింపునకు సైతం సన్నాహాలు చేయాలని భావించారు. అటు ఉద్యోగులను కూడా మానసికంగా విశాఖకు వెళ్లే విధంగా సిద్ధం చేశారు. అయితే సుప్రిం కోర్టు కేసు విచారణను వాయిదా వేసేసరికి వారి ఆశలు నీరుగారిపోయాయి. ఇన్నాళ్లూ హైకోర్టులో విచారణకు రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయగా.. ఇప్పుడు అదే పంథాను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యర్థులు అనుసరిస్తున్నారు. సుప్రింకోర్టులో విచారణ జాప్యానికి అవకాశమున్న అంశాలను వినియోగించుకుంటున్నారు. దీంతో ఈ కేసు ఇప్పట్లో కొలిక్కి వచ్చే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు.
