
YCP- TDP: విపక్షంలో ఉన్నప్పుడే అర్హులైన ఓటర్లను తొలగించిన ఘనత వైసీపీది. వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆలోచనలను పక్కగా వర్కవుట్ చేయడం వల్లే గత ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించింది. ఎన్నికలకు ముందు ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి ఓట్ల తొలగింపునకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంలో పీకే టీమ్ పాత్ర ఉన్నట్టు ఆరోపణలున్నాయి. ఇంతలో ఎన్నికలు రావడం, వైసీపీ విజయం సాధించడంతో ఆ అంశం మరుగున పడిపోయింది. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో మరోసారి ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల సానుభూతిపరుల ఓట్లు తొలగించడానికి ప్రయత్నాలు జరుగుండడం అనుమానాలకు తావిస్తోంది. నాడు విపక్షంలో ఉన్నప్పుడే ఇటువంటి చర్యలకు అలవాటుపడిన వారు..ఇప్పుడు పవర్ చేతిలో ఉండడంతో ఊరుకుంటారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అందుకు తగ్గట్టుగానే అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని రెండు గ్రామాల్లో 500కుపైగా ఓట్లు తొలగించడం వెలుగులోకి వచ్చింది.
సాధారణంగా ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాత్రమే వలస ఓటర్లను ప్రత్యేక వాహనంలో రప్పించవచ్చు. గెలుపు కోసం వ్యయప్రయాసలు పడాల్సి ఉంటుంది. అదే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగితే అది సాధ్యం కాదు. అందుకే అధికార వైసీపీ కొత్త ఎత్తుగడ వేసింది. వలస ఓటర్లు, అందునా విపక్షాలకు సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తే పోలే అన్న ఆలోచనకు వచ్చింది. సాధారణంగా వలస కూలీలు వ్యవసాయ సీజన్లలో పనులు పూర్తిచేసుకొని మిగతా సమయంలో సుదూర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళుతుంటారు. ఇటువంటి వారు సంక్షేమ పథకాలకు కాస్తా దూరంగా ఉంటారు. రెక్కల కష్టాన్నే నమ్ముకుంటారు. పైగా వివిధ ప్రాంతాలు తిరిగి రావడంతో ప్రభుత్వంపై ఒక రకమైన వ్యతిరేక భావనతో ఉంటారు. దీనిని గుర్తించిన వైసీపీ సర్కారు వలస ఓటర్ల ఓట్లపై గురిపెట్టింది. కూడికలు, తీసివేతలు వంటి లెక్కలు వేసుకొని ఎవరైతే తమకు ప్రతికూలంగా ఉన్నారో వారి ఓట్లను తొలగించే పనిలో పడ్డారు.
ఆ మధ్యన పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో పెద్దఎత్తున ఓట్లను తొలగించారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు దర్యాప్తునకు ఉపక్రమించారు. ఇంతలో ఇద్దరు బీఎల్ వోలను బాధ్యులు చేస్తూ విధుల నుంచి తొలగించారు. అంటే అక్కడ తప్పు జరిగిందని ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు ధర్మవరంలో ఏకంగా 500 ఓట్లు తొలగించడం ఆందోళన కలిగిస్తోంది.

వాస్తవానికి గ్రామాల్లో తమ ఓటు ఉందో? లేదో? అని ఎవరూ చూసుకోరు. పోలింగ్ రోజున మీపేరు జాబితాలో లేదని చెబుతుండడంతో అవాక్కవుతుంటారు. తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు జాబితాను రాజకీయ పార్టీలు చూసుకుంటాయి. చేర్పులు, మార్పులు చేస్తుంటాయి. ఇప్పుడు కూడా అదే పనిచేసే క్రమంలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించడాన్ని ఆ పార్టీ గుర్తించింది. గత వారం రోజులుగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లను గుర్తించడమే పనిగా వలంటీర్లు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. విపక్షంలో ఉన్నప్పుడే ఎక్కడో బిహార్ నుంచి ఫారం7 దాఖలు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు.. ఊరుకుంటారా? వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఇదో ఆప్షన్ గా పెట్టుకున్నారు. దీనికి విపక్షాలు అడ్డుకట్ట వేయకపోతే మాత్రం మూల్యం తప్పదు.
