Kerala Explosives Network: కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక సాధారణ లారీ సోదా నుంచి మొదలైన ఘటన ఇప్పుడు దక్షిణ భారతదేశ భద్రతా వ్యవస్థను కదిలిస్తోంది. ఉల్లిగడ్డల సంచుల్లో దాచిన 89,600 జెలటిన్ స్టిక్స్. 10,500 డిటోనేటర్ల స్వాధీనం కేవలం అక్రమ వ్యాపారం కాకుండా, భారీ స్థాయి ఉగ్రవాద సామర్థ్యాన్ని సూచిస్తున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తు సంకేతాలు ఇస్తున్నాయి.
ఉల్లిగడ్డల మాటున జిలిటెన్ స్టిక్స్..
ఫిబ్రవరి 7న మలప్పురం జిల్లాలో పోలీసులు ఒక లారీని సోదా చేసి హాలో బ్రిక్స్‌తో పాటు ఉల్లిగడ్డల సంచుల్లో దాచిన జెలటిన్ స్టిక్స్‌ను గుర్తించారు. డ్రైవర్ వాదన (‘‘మూడో భార్య ఇంటికి తీసుకెళ్తున్నాను’’) మరింత అనుమానాస్పదంగా మారింది. అక్కడి సెర్చ్‌లో మరిన్ని పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. లైసెన్స్ లేకుండా గ్రానైట్ క్వారీలు, మైనింగ్ కోసం అని చెప్పుకునే ఈ పదార్థాలు వాస్తవానికి ఎంతటి వినాశకర శక్తిని కలిగి ఉన్నాయో ఇప్పుడు స్పష్టమవుతోంది.
ఎన్ఐఏ రంగప్రవేశం…
ఈ కేసును కేరళలోని అప్పటి కమ్యూనిస్టు ప్రభుత్వం మొదట ఎన్ఐఏకు అప్పగించకపోవడం గమనార్హం. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక ఎన్ఐఏ కేసును టేకప్ చేసింది. మే 30, 2026న కేరళ, కర్ణాటక, తమిళనాడు అంతటా ఏకకాలంలో 19 చోట్ల దాడులు జరిపి ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. కోజికోడ్, మలప్పురం, కొండోట్టి వంటి ప్రాంతాల్లో నిల్వలు బయటపడ్డాయి. ఈ నెట్వర్క్ మూడు రాష్ట్రాల్లో విస్తరించి ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
మలప్పురం లారీతో సంబంధం?
కేరళలో ఇస్లామిక్ ఉగ్రవాదం దీర్ఘకాలిక సమస్య. ఐసిస్‌లో కేరళ యువకులు చేరడం, ఎల్కే అధ్వానీపై దాడి ప్రయత్నం, శివరాత్రి రోజు శివాలయం ఎదుట బాంబు వ్యాన్ పేల్చడం, మంగళూరులో ప్రెషర్ కుక్కర్ బాంబు ఇలాంటి ఘటనలు ఇప్పటికీ గుర్తుండిపోయాయి. గ్రానైట్ ఫ్యాక్టరీలు, ఖనిజ సంబంధిత కవర్ల కింద పేలుడు పదార్థాలు తరలించడం ఇప్పుడు కొత్త కోణం. ఫిబ్రవరి సీజర్కు, మే 30 దాడులకు మధ్య సంబంధం ఉందా అని ఎన్ఐఏ ప్రత్యేకంగా విచారిస్తోంది. ఇక్కడ ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిల్వలు జరగడం, భక్తల్ సోదరులు వంటి అంతర్జాతీయ లింకులు, ఉత్తరప్రదేశ్–రాజస్థాన్–పంజాబ్‌లో ఇటీవల అరెస్టైన ఐఎస్ఐ ఏజెంట్లు.. ఈ అన్నీ కలిపి చూస్తే ఒక పెద్ద నెట్వర్క్ ఆవరణ కనిపిస్తుంది.
భద్రతా లోపాలు…
కేరళలో ఉగ్రవాదులను విడుదల చేయాలని కాంగ్రెస్–కమ్యూనిస్టు పక్షాలు అసెంబ్లీలో తీర్మానం చేయడం వంటి రాజకీయ చర్యలు భద్రతా ఏజెన్సీల పనిని క్లిష్టతరం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఐఏకు కేసు అప్పగించడంలో ఆలస్యం చేయడం కూడా ప్రశ్నార్థకం. ఇంత భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు దేశంలో ఎక్కడైనా సులభంగా తిరగడం రాష్ట్ర యంత్రాంగంలోని లోపాలను బయటపెడుతోంది.
అక్రమ వ్యాపారమా లేక వినాశకర ప్రణాళికా?
89 వేల జెలటిన్ స్టిక్స్ అనేది గ్రానైట్ క్వారీల కోసం కాకుండా చాలా పెద్ద ఎత్తున ఉపయోగించగల శక్తి. లైసెన్స్ లేకుండా, ఉల్లిగడ్డలు–బ్రిక్స్‌ల మాస్క్‌లో రవాణా చేయడం, మల్టీ–స్టేట్ నెట్వర్క్ ఇవన్నీ సాధారణ క్రై మ్ కంటే ఉగ్రవాద లక్ష్యాలను సూచిస్తాయి. ఇప్పటి వరకు ‘‘దేనికి ఉపయోగించాలనుకున్నారు’’ అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. కానీ కేరళ ఉగ్రవాద చరిత్ర, సరిహద్దు ఏజెంట్ల కార్యకలాపాలు, దక్షిణాది రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ చూస్తే ఇది సాధారణ అక్రమ వ్యాపారం కంటే ఎక్కువగా ఉండవచ్చని అనుమానాలు బలపడుతున్నాయి.
ఈ కేసు కేవలం ఒక లారీ సీజర్ కాదు. ఇది దక్షిణ భారతదేశంలో ఉగ్రవాదం మళ్లీ సంస్థాగత స్థాయిలో పునరుద్ధరణ చేసుకుంటున్నట్లు హెచ్చరిక. ఎన్ఐఏ దర్యాప్తు పూర్తి స్వేచ్ఛతో, రాజకీయ జోక్యం లేకుండా ముందుకు సాగాలి. రాష్ట్రాలు కేంద్ర ఏజెన్సీలతో సహకరించకపోతే భద్రతా లోపాలు పునరావృతమవుతాయి.
