Kedarnath Temple: సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకోవడం కోసం ఇటీవల ఒక యూట్యూబర్ పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో తన ప్రేమను ప్రపోజ్ చేసిన సంఘటన ఆలయ వర్గాలను విస్మయానికి గురి చేసింది. దీంతో ఆలయంలో ఇటువంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కఠిన చర్యలకు ఉపక్రమించింది శ్రీ కేదార్‌నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ.
విశాఖ యూట్యూబర్..
కొద్దిరోజుల క్రితం విశాఖ ఫల్స్ నుంగే అనే ఒక యూట్యూబర్ తన ఫాలోవర్ల మెప్పు కోసం ఉత్రాఖండ్ లోని కేదార్‌నాథ్ ఆలయంలో మోకరించి తనకు బాయ్ ఫ్రెండుకు తన ప్రేమను తెలియజేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మెప్పు పొందడం సంగతి అటుంచితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఆలయంలో పిచ్చి పనులేంటని కామెంట్లు కూడా పోటెత్తాయి. ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నామని నెటిజన్లు అత్యధిక సంఖ్యలో ఆమెను ఏకిపారేశారు.
రంగంలోకి ఆలయ కమిటీ..
ఈ సంఘటన జరిగిన కొద్ది వారాలకు శ్రీ కేదార్‌నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ సమావేశమై పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుడదని ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్లను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్బంగా శ్రీ కేదార్‌నాథ్ బద్రీనాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజయ్ అజేంద్ర మాట్లాడుతూ.. కేదార్‌నాథ్ ఆలయానికి వచ్చే యాత్రికులు నిండైన దుసులు ధరించాలని, గతంలో కొంతమంది ఇష్టానుసారంగా దుస్తులు ధరించి ఫొటోలు, వీడియోలు తీసుకున్నారని చెబుతూ.. అది సరైన పద్దతి కాదన్నారు. మళ్లీ ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బద్రీనాథ్‌లో కూడా మొబైల్ ఫోన్లను నిషేధించే విషయమై ఆలోచిస్తున్నామని తెలిపారు.