KCR- Etela Rajender: బీజేపీతో ఢీ అంటే ఢీ అని కొట్లాడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ఎక్కడా తగ్గేదే లే అంటున్నారు. ఒకవైపు రాష్ట్రంలో ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నా.. కమలం నేతలకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. త్వరలో కాషాయ దళానికి మరో ఝలక్ కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ఈటల బహిష్కరణతో టీఆర్‌ఎస్‌కు భారీ నష్టం..
తెలంగాణ ఉద్యమకారుడు, సౌమ్యుడిగా పేరు ఉన్న ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్‌లో నంబర్ 2 గా ఎదిగారు. తన పార్టీలో ఎప్పుడూ నంబర్ 2ను పొజిషన్‌ను కేసీఆర్ సహించరు. ఈ క్రమంలోనే మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ను భూ కబ్జాల ఆరోపణల పేరుతో బర్తరఫ్ చేశారు. అవమానకర రీతిలో పార్టీని వీడేలా చేశారు. ఆ తర్వాత ఈటల రాజేందర్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బీజేపీలో చేరారు. ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో టీఆర్‌ఎస్‌పై విజయం సాధించారు. ఈ పరిణామం టీఆర్‌ఎస్‌కు పెద్ద ఎదురు దెబ్బ. హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల దిశను మార్చేసింది. టీఆర్‌ఎస్‌ను బలహీనంగా బీజేపీని శక్తివతంగా చేసింది.
రాజేందర్‌తో రహస్య మంతనాలు..
బీజేపీ ఈటలకు పార్టీలో మంచి ప్రాధాన్యం ఇచ్చింది. ఈ క్రమంలో ఆయన పార్టీలో కీలక నేతగా ఎదిగారు. చేరికల కమిటీ చైర్మన్ హోదాలో టీఆర్‌ఎస్‌ను బలహీనపర్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బూర నర్సయ్యగౌడ్‌ను పార్టీలోకి తీసుకురాగలిగారు. ఈటల మార్గంలోనే చాలామంది ఉద్యమకారులు కూడా టీఆర్‌ఎస్‌ను వీడారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్ ఉద్యమ ద్రోహుల పార్టీగా మారిందన్న చర్చ తెలంగాణలో జరుగుతోంది. ఒక్క దెబ్బతో ఆ ముద్ర పోగొట్టుకోవాలని టీఆర్‌ఎస్ అధినేత భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్‌తో రహస్యంగా కేసీఆర్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈటలను తిరిగి టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటే పార్టీపై పడిన ముద్ర పోవడంతోపాటు.. బీజేపీని బలహీనపర్చవచ్చని గులాబీ బాస్ ఆలోచన.
సేమ్ పొజిషన్ ఆఫర్..
ఈటల రాజేందర్ తిరిగి సొంత గూటికి వస్తే.. ఆయనకు గతంలో ఉన్న నంబర్ 2 పొజిషన్‌తోపాటు మంత్రి పదవి కూడా ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు తుది దశలో ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు బండి సంజయ్ కారణంగా రాజేందర్ బీజేపీలో ఇమడలేకపోతున్నారన్న చర్చ మొదటి నుంచి జరుగుతోంది. కేసీఆర్ మంత్రాంగం ఫలించి ఈటల సొంత గూటికి వెళితే.. బీజేపీ నైతికంగా దెబ్బతినడంతోపాటు.. టీఆర్‌ఎస్ నుంచి ఫిరాయించాలని భావిస్తున్నవారు కూడా పునరాలోచన చేస్తానని గులాబీ బాస్ ఈ ఎత్తు వేశారన్న చర్చ జరుగుతోంది.

ఆఫర్‌ను తిరస్కరించిన ఈటల
మరోవైపు కేసీఆర్ ఇచ్చిన ఆఫర్‌ను ఈటల రాజేందర్ తిరస్కరించినట్లు కూడా తెలుస్తోంది. అవమానకర రీతిలో తనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడమే కాకుండా.. తన పరువును మంటగలిపాడన్న ఆలోచనలో ఈటల ఉన్నారు. మొదటి నుంచి ఆత్మగౌరవ నినాదంతోనే ఉన్న రాజేందర్ తాజాగా కేసీఆర్ ఆఫర్‌ను కూడా తిరస్కరించినట్లు సమాచారం. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. ఈ క్రమంలో ఏదైనా జరగవచ్చు అనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.