Homeజాతీయ వార్తలుKCR : 40 వేల కోట్ల కోసం కేసీఆర్ వెంపర్లాట: వచ్చే నెలలో అసెంబ్లీ భేటీకి...

KCR : 40 వేల కోట్ల కోసం కేసీఆర్ వెంపర్లాట: వచ్చే నెలలో అసెంబ్లీ భేటీకి ప్లాన్

KCR : కేసీఆర్ పదే పదే చెప్పే బంగారు తెలంగాణ ఇప్పుడు అప్పుల తెలంగాణ అయింది. ఉద్యోగులకు జీతాలు ఒకటో తారీఖు ఇచ్చే పరిస్థితి లేదు. బాండ్లు విక్రయించి అప్పులు తెస్తోంది. వచ్చే ఆదాయం కూడా అప్పులు, వడ్డీలకే సరిపోతుంది. పైగా పనులు చేసిన కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు కూడా వారికి స్వరం కలుపుతున్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఇదే సమయంలో ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామపంచాయతీ ఖాతాల్లోకి బదిలీ చేసింది. గతంలో ఈ నిధులు ప్రభుత్వం వాడుకునేది. దీనివల్ల ఎంతో కొంత వెసలు బాటు ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పైగా ఇచ్చే అప్పులపై కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక కొర్రీలు పెడుతోంది. కొత్తగా కార్పొరేషన్లు ఏర్పాటు చేద్దామన్నా ఏవీ లేవు.. ఆఖరికి ఆ కాలేశ్వరం ప్రాజెక్టు మీద కూడా ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసి దండిగా అప్పులు తెచ్చింది. ఒకరకంగా చూస్తే కెసిఆర్ చెప్తున్న బంగారు తెలంగాణ కాకుండా.. అప్పుల తెలంగాణ అయింది. ఇలాంటి స్థితిలో కేంద్రంతో సయోధ్యగా ఉండేందుకు ప్రయత్నించాల్సిన కేసీఆర్.. యుద్ధాన్ని కోరుకుంటుండడంతో ఆ ప్రభావం రాష్ట్ర ఆర్థిక ప్రగతి పై పడుతోంది.

-కేంద్రాన్ని బోనులో నిలబెట్టాలని..

మునుగోడు ఫామ్ హౌస్ డీల్స్ అనుకున్నంత స్థాయిలో ఫాయిదా ఇవ్వకపోవడంతో కెసిఆర్.. కేంద్ర ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పెట్టాలి అనుకుంటున్నారు. అందులో భాగంగా వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలి అనుకుంటున్నారు.. సుమారు వారం పాటు ఈ సమావేశాలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. దీని ద్వారా కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన 40 వేల కోట్లలో కొర్రీలు పెడుతోందని, అందుకే అప్పులు తెస్తున్నామని ప్రజలకు చెప్పేందుకు కెసిఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు.

-అవి కేంద్రం ఇవ్వాల్సినవి కాదు అప్పులు

కెసిఆర్ చెబుతున్నట్టు ఆ 40 వేల కోట్లు.. కేంద్రం ఇవ్వాల్సినవి కావు.. తీసుకు రావలసిన అప్పులు. ఇప్పటికే గ్యారెంటీ రుణాల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉంది.. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రం దివాలా తీసే ప్రమాదం ఉంటుందని గ్రహించి కేంద్ర ప్రభుత్వం అప్పుల విషయంలో అనేక షరతులు విధిస్తోంది.. పైగా తెలంగాణకు ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు తగ్గట్టుగా రుణాలు అందడం లేదు.. ఎఫ్ ఆర్ బి ఎం పరిమితికి మించి అదనంగా కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అప్పుచేసింది.. అయితే వీటిని కూడా రాష్ట్ర అప్పుగా పరిగణిస్తామని ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.. కేంద్రం బయట ఏ విధంగా అయితే అప్పులు తెస్తోందో, రాష్ట్రం కూడా అదే విధంగా అప్పులు తేవాలని కేంద్ర అధికారులు అంటున్నారు. అయితే రాజ్యాంగం కల్పించిన హక్కుల ఆధారంగా తెలంగాణకు అప్పులు తెచ్చుకునే అవకాశం ఇవ్వాలని, లేకుంటే అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని రాష్ట్ర అధికారులు కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్రం అసలు అంగీకరించడం లేదు.

మొన్నటిదాకా వడ్ల కొనుగోలు, నిన్న ఫామ్ హౌస్ డీల్స్, ఇప్పుడు అప్పులు.. మొత్తానికి కేంద్రంతో కేసీఆర్ యుద్ధాన్ని కోరుకుంటున్నారు. అయితే ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను అసెంబ్లీ స్పీకర్ సస్పెండ్ చేశారు. మరి వచ్చే నెలలో నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో అయినా ఆయనకు అవకాశం కల్పిస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.. అయితే ప్రస్తుతం బిజెపికి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజా సింగ్ కూడా జైలు నుంచి ఇటీవల విడుదలయ్యారు.. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు బిజెపి ఎమ్మెల్యేలు కూడా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తానికి ఈసారి అసెంబ్లీ సమావేశాలు బిజెపి వర్సెస్ టిఆర్ఎస్ అన్నట్టుగా సాగే అవకాశాలు ఉన్నాయి.. కానీ ఇందుకు అసెంబ్లీ స్పీకర్ ఒప్పుకుంటేనే.. మొత్తానికి కెసిఆర్ ప్రగతి భవన్ మాత్రమే కాదు రాష్ట్ర అసెంబ్లీని కూడా తన రాజకీయాలకు వాడుకుంటున్నారనే టాక్ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular