KCR Manifesto
KCR Manifesto: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ లో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే అభ్యర్థులతో భేటీ అయ్యారు. ఎన్నికల మేనిఫెస్టో కూడా ప్రకటించారు. అభ్యర్థులకు బీ ఫారాలతో పాటు, ఖర్చులకు చెక్కులు కూడా ఇచ్చారు. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు. ఎన్నికల సంఘం కఠినమైన నిబంధనలు విధిస్తున్న నేపథ్యంలో ఎలా మసులుకోవాలో హితబోధ చేశారు. ఇలా కేసీఆర్ చెబుతున్నారో లేదో.. ఖమ్మం జిల్లా భారత రాష్ట్ర సమితికి కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక కీలకమైన నాయకుడు భారత రాష్ట్ర సమితికి.. అది కూడా ఎన్నికల సమయంలో గుడ్ బాయ్ చెప్పారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వంటి సీనియర్ నాయకులు రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో.. బిసి అందులోనూ బలమైన గౌడ సామాజిక వర్గానికి చెందిన ఒక కీలకమైన నాయకుడు భారత రాష్ట్ర సమితి రాజీనామా చేయడం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ కొంతకాలం నుంచి నారాజ్ గా ఉన్నారు. అధిష్టానం ఆయనను పట్టించుకోకపోవడం.. భద్రాచలం టిక్కెట్ తెల్లం వెంకట్రావుకు కేటాయించడంతో ఆయన కినుక వహించారు. తెల్లం వెంకటరావు భారత రాష్ట్ర సమితిలో చేరడం బాలసాని లక్ష్మీనారాయణకు అస్సలు ఇష్టం లేదు. ఇదే విషయాన్ని ఆయన అధిష్టానానికి పలుమార్లు చెప్పారు. అయినప్పటికీ అధిష్టానం తెల్లం వెంకటరమణ పార్టీలో చేర్చుకోవడంతో బాలసాని లక్ష్మీనారాయణ నారాజ్ అయ్యారు. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. ఆయనను పార్టీలోకి ఆహ్వానించేందుకు సీనియర్ రాజకీయ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్లారు. బాలసాని లక్ష్మీనారాయణ ఇంట్లో భేటీ అయ్యారు. అయితే బాలసాని పార్టీ మారతారని సంకేతాలు ఉన్న భారత రాష్ట్ర సమితి.. ఆయనను భద్రాచలం పార్టీ ఇన్చార్జి పదవి నుంచి తప్పించింది. ఆ బాధ్యతలను ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కు అప్పగించింది.
అయితే గతంలోనూ స్థానిక సంస్థల సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటు బాలసాని లక్ష్మీనారాయణకు ఇవ్వకుండా బీఆర్ఎస్ అధిష్టానం తాతా మధుసూదన్ కు అప్పగించింది. దీంతో గత కొద్ది రోజులుగా లక్ష్మీనారాయణ అధిష్టానం పై అలక బూనారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అయితే బాలసాని వ్యవహారం తెలిసిన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్తమానం పంపారు. దీంతో బాలసాని కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో ఆయన ఇంటికి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెళ్లారు. ముగ్గురి మధ్య చర్చల అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు లక్ష్మీనారాయణ సుముఖత వ్యక్తం చేశారు. లక్ష్మీ నారాయణ రాకతో కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బీసీ సామాజిక వర్గంలో పార్టీ పట్టు పెరుగుతుందని వారు అంచనా వేస్తున్నారు. అంతకుముందు బాలసాని లక్ష్మీనారాయణ తో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర భేటీ అయ్యారు. మంత్రి కేటీఆర్ తో ఫోన్లో మాట్లాడించారు.. అయితే కేటీఆర్ మాటలకు బాలసాని లక్ష్మీనారాయణ మెత్తబడలేదని సమాచారం. పార్టీలో తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయన కేటీఆర్ ముందు ఏకరువు పెట్టారని తెలుస్తోంది.. తనకు గుర్తింపు లేని చోట ఉండలేనని ఆయన కేటీఆర్ తో స్పష్టం చేసినట్టు సమాచారం.