Asaduddin Owaisi – KCR: దోస్త్.. అంటే సుఖాలతోపాటు కష్టాల్లోనూ తోడుండేవాడు. స్నేహానికి ప్రపంచంతో ఎంతో విలువ ఉంది. కానీ రాజకీయాల్లో స్నేహితులు, శత్రువులు శాశ్వతంగా ఉండరు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అంత్యంత ఆప్తమిత్రుడు అసదుద్దీన్ ఒవైసీ. అయితే ఆయన సుఖాల్లో మాత్రమే తోడు ఉంటారన్న అపవాదు ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన చేరడం ఎంఐఎంకు అలవాటే. ప్రస్తుతం టీఆర్‌ఎస్ మిత్రపక్షంగా ఎంఐఎం, కేసీఆర్‌కు ప్రాణమిత్రుడుగా అసదుద్దీన్ కొనసాగుతున్నారు. ఎవరు అడిగినా సీఎం కాదంటారేమో కానీ, అసదుద్దీన్ అడిగితే మాత్రం కాదను. అయితే ఆయన బీఆర్‌ఎస్ సభకు దూరంగా ఉన్నారు. కేసీఆర్ తాజాగా కష్టాల్లో ఉన్నారు. కష్టసమయంలో తప్పుకునే అసదుద్దీన్ ఇప్పుడు కూడా దూరం జరిగారా లేక కేసీఆర్ ఆహ్వానం పంపలేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ధూంధాంగా సభ..
జాతీయ రాజకీయాల కోసం టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఖమ్మంలో పార్టీ ఆవిర్భావ సభ అట్టహాసంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్ భేరీసభ ధాంధూంగా జరిగింది. తెలంగాణలో అధికార పార్టీ సభనా, మజాకా? సీఎం కేసీఆర్ తలచుకుంటే విజయవంతం కాకుండా ఎలా వుంటుంది? టీఆర్‌ఎస్ కాస్త బీఆర్‌ఎస్‌గా అవతరించిన తర్వాత జాతీయ స్థాయి నాయకుల్ని ఆహ్వానించి మరీ సభ నిర్వహించడం విశేషం. తద్వారా తన పార్టీకి జాతీయ స్థాయి అటెన్షన్ తీసుకొచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నించారు.
అతిథుల రాక..
ఖమ్మం బీఆర్‌ఎస్ సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా హాజరు కావాల్సి వుండింది. అయితే స్థానికంగా ముఖ్యమైన కార్యక్రమాలు ఉండడంతో రాలేకపోయినట్టు కేసీఆర్‌కు సమాచారం అందించారు.
దోస్త్‌ను దూరం పెట్టారా.. దూరం అయ్యాడా?
ఈ సభలో కేసీఆర్ ఆప్తుడైన నాయకుడు లేకపోవడం కొరతే అని చెప్పక తప్పదు. తెలంగాణలో చెట్టపట్టాలేసుకుని తిరిగే ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సభకు రాకపోవడం గమనార్హం. కేసీఆర్ వ్యూహాత్మకంగా ఆహ్వానించ లేదా? అనే చర్చ జరుగుతోంది. అసదుద్దీన్ బ్రదర్స్ భుజాలపై గన్ పెట్టి తనను రాజకీయంగా కాల్చుతారనే భయం కేసీఆర్‌లో బాగా ఉన్నట్టుంది. కేసీఆర్ ఆహ్వానించలేదా? లేక ఇరుపార్టీల రాజకీయ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని అసదుద్దీన్ దూరంగా ఉన్నారా? అనే అంశంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బీఆర్‌ఎస్‌తో చెట్టాపట్టాల్..
తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఎంఐఎం అధికార పార్టీతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతోంది. తమ పనులు చేసుకుంటోంది. తాజాగా బీఆర్‌ఎస్‌కు అన్ని విధాలా అసదుద్దీన్ అండగా నిలిచే సంగతి తెలిసిందే. ఇప్పటికే జీహెచ్‌ఎంసీలో ఎంఐఎం మద్దతుతోనే బీఆర్‌ఎస్ అధికారాన్ని సొంతం చేసుకుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికల సమయంలో మాత్రం ‘నువ్వు కొట్టినట్టుండాలి, నేను ఏడ్చినట్టు కనిపించాలి’ అనే రీతిలో బీఆర్‌ఎస్, ఎంఐఎం రాజకీయాలు చేస్తుంటాయి. ఏది ఏమైనా వ్యూహంలో భాగంగానే ఖమ్మం సభలో అసదుద్దీన్ కనిపించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.