CM KCR: కేసీఆర్ తాజా ఫొటోలు వైరల్

వాస్తవానికి కేసీఆర్ కథ కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది.. జ్వరం, ఛాతీ సంబంధిత ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడ్డారు.

Written By: K.R, Updated On : October 13, 2023 9:14 am

CM KCR

Follow us on

CM KCR: “కెసిఆర్ ఆరోగ్యం పట్ల మాకు ఆందోళనగా ఉంది. కేటీఆర్ ఏదో దాస్తున్నారు. కెసిఆర్ ఆరోగ్యం గురించి ఆయన బయటపెట్టాలి”..” కెసిఆర్ నా రాజకీయ గురువు. ఆయన కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం గురించి మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాలి”.. ఇలా ప్రతిపక్షాలు రకరకాల కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారిగా బయటికి వచ్చారు. తన అధికారిక సామాజిక మాధ్యమాలలో ఒక్కసారిగా మెరిశారు. దీంతో ఆయన అనారోగ్యంపై ఇన్నాళ్లు వ్యాప్తిలో ఉన్న అనుమానాలు ఒక్కసారిగా పటా పంచలయ్యాయి. ప్రతీ సారి నీట్ షేవ్ తో కనిపించే కేసీఆర్.. ఈసారి ఒకింత గడ్డంతో కనిపించారు. ముఖంలో కూడా మునుపటి కళ కనిపించలేదు.

వాస్తవానికి కేసీఆర్ కథ కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది.. జ్వరం, ఛాతీ సంబంధిత ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడ్డారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కెసిఆర్ ఇంతవరకు విలేకర్ల సమావేశంలో మాట్లాడలేదు. ఆమధ్య పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ.. తర్వాత కెసిఆర్ ప్రగతి భవన్ కు మాత్రమే పరిమితమయ్యారు. కెసిఆర్ అనారోగ్యం వల్ల పార్టీ కార్యవర్గ సమావేశాలు కూడా రద్దయ్యాయి. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు మినహా మిగతా వారెవరికి కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో కేసీఆర్ ఆరోగ్యం పట్ల అందరిలో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆయన వ్యక్తిగత ఆరోగ్యాన్ని పర్యవేక్షించే వైద్యులు ఎంవి రావు కూడా ప్రగతి భవన్ కు తరచూ వెళ్లి వచ్చేవారు. గతంలో కేసీఆర్ అనారోగ్యానికి గురైనప్పుడు హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేయించుకున్నారు. గత ఎన్నికల సమయంలో ఇదే తీరుగా అనారోగ్యానికి గురైనప్పుడు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందారు.

ఇక ఇటీవల కాలం నుంచి కూడా కెసిఆర్ అనారోగ్యంతో దాదాపు 20 రోజులపాటు ప్రగతి పవన్ కే పరిమితమయ్యారు. అయితే కెసిఆర్ అనారోగ్యానికి గురి కాలేదని, ఎన్నికల మేనిఫెస్టో రూపొందించే పనిలో నిమగ్నమయ్యారని భారత రాష్ట్ర సమితికి చెందిన అంతర్గత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తాజాగా గురువారం ప్రగతిభవన్లో ఉమ్మడి మహ బూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి సంబంధించి రూపొందించిన నివేదికను మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందించగా.. కెసిఆర్ ఆవిష్కరించారు. ఈ చిత్రాన్ని ముఖ్యమంత్రి అధికారిక సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో ద్వారా ఒక్కసారిగా కెసిఆర్ అనారోగ్యం మీద ఉన్న అనుమానాలు మొత్తం నివృత్తి అయ్యాయి. కెసిఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్న నేపథ్యంలోనే ఎన్నికల ప్రచార తేదీలను ప్రకటించారని, త్వరలో అభ్యర్థులకు బీ ఫామ్ లు అందజేస్తారని భారత రాష్ట్ర సమితి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.