
Telangana Holidays: తెలంగాణలో వేసవి సెలవులు ప్రకటించారు. ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు దాదాపు 48 రోజుల పాటు సెలవులు ఇస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. కరోనా ప్రభావంతో రెండేళ్లు విద్యావ్యవస్థ గందరగోళంగా మారింది. ఈ సంవత్సరం కరోనా ప్రభావం లేకపోవడంతో చదువు సజావుగా సాగింది. దీంతో పరీక్షలు నిర్వహించిన అనంతరం సెలవులు మంజూరు చేయనుంది.
ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఏప్రిల్ 12 నుంచి పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో 1-5 తరగతుల వారికి నాలుగు విషయాలు ఉండటంతో వీరి పరీక్షలు ఏప్రిల్ 17తో పూర్తవుతాయి. 6-9 తరగతుల వారికి ఏప్రిల్ 20తో పరీక్షలు ముగుస్తాయి. పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 21న వెల్లడిస్తారు. 24న తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి అనంతరం సెలవులు ఇస్తారు.
ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు సెలవులు ఉంటాయి. తిరిగి జూన్ 12న పాఠశాలలు పున:ప్రారంభం
కానున్నాయి. తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు నడుస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఈ మేరకు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో తగిన మంచినీటి సదుపాయం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఒంటి పూట బడి ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగిస్తున్నారు. ఏప్రిల్ 24 వరకు ఇలాగే ఉంటుంది. వేసవి సెలవుల్లో పిల్లలను బయటకు పంపకుండా చూడాలని తల్లిదండ్రులకు తెలియజేయనున్నారు. ఈత కోసం వెళ్లి చాలా మంది తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీంతో వారిని ఎటు వెళ్లకుండా ఏదైనా నేర్పించేందుకు ప్లాన్ చేయడం మంచిది.