KCR- Munugode By Election 2022: మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలన్నీ వ్యూహరచనల్లో మునిగిపోయాయి. దసరా తరువాత క్షేత్రస్థాయిలోకి దిగడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాయి. మరోవైపు ఉప ఎన్నిక ఇప్పుడు అన్ని పార్టీలను టెన్షన్ పెడుతోంది. బీజేపీ నేతలు ఇప్పటికే మునుగోడు విజయం తమే అంటున్నారు. ఆ పార్టీ ఇప్పటికే విజయంపై కన్నేసింది. జాతీయ నేతలు కూడా రంగంలోకి దిగి ప్రచారం చేసే అవకాశం ఉండటంతో.. టీఆర్‌ఎస్ కూడా వ్యూహం మార్చినట్టు తెలుస్తోంది. భారీగా గులాబీ దండును నియోజకర్గంలో మోహరించాలని చూస్తోంది.

బీజేపీ విజయాన్ని అడ్డుకునేందుకు..
మునుగోడులో బీజేపీ విజయాన్ని అడ్డుకుని అక్కడ గులాబీ జెండా ఎగరేలా చూసుకోవాలని భావిస్తున్న టీఆర్‌ఎస్ నాయకత్వం.. అందుకోసం భారీ ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఉప ఎన్నికను ఏ మాత్రం లైట్ తీసుకోవద్దని భావిస్తున్న సీఎం కేసీఆర్ ఇందుకోసం నేతలందరికీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
Also Read: KCR- BRS: మునుగోడు బరిలో టీఆర్‌ఎస్సా..? బీఆర్‌ఎస్సా..?.. కేసీఆర్ ప్రకటనపై ఉత్కంఠ
86 మంది ఎమ్మెల్యేకు బాధ్యతలు..
మునుగోడును 86 యూనిట్లుగా విభజించి ఒక్కో యూనిట్‌కు ఒక్కో ఎమ్మెల్యేను బాధ్యులుగా కేసీఆర్ నియమించబోతున్నారని సమాచారం. ఆ బాధ్యతల విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదని.. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుకు సైతం ఇందుకు సంబంధించిన బాధ్యతలను అప్పగించబోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దసరా సందర్భంగా నిర్వహించే సమావేశంలో ఈమేరకు ప్రకటన ఉంటుందని సమాచారం.
దసరా సమావేశంలో అభ్యర్థిపై క్లారిటీ..
మునుగోడు ఉప ఎన్నికల కోసం టీఆర్‌ఎస్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతోందనే అంశంపై దసరా రోజున జరగబోయే సర్వసభ్య సమావేశంలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. అభ్యర్థిని కూడా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. నిజానికి మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యతను నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలకు అప్పగించాలని కేసీఆర్ భావించారు. ప్రస్తుతం వాళ్లే మునుగోడు నియోజకవర్గంలో ప్రచార బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.

బీజేపీ దూకుడుతో..
అయితే బీజేపీ నేతలు మునుగోడు ఉప ఎన్నికపై ఎక్కువగా ఫోకస్ చేసింది. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు సైతం కాషాయ పార్టీలో చేరుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ నేతలు కూడా రంగంలోకి దిగి ప్రచారం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ కూడా వ్యూహం మార్చినట్టు తెలుస్తోంది. అందుకే మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు బాధ్యతను కేవలం జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలకు మాత్రమే ఇవ్వకుండా.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులందరికీ ఈ మేరకు బాధ్యతలు అప్పగించి.. కొందరు ముఖ్యనేతలు ఎప్పటికప్పుడు ఈ వ్యవహారాలను పర్యవేక్షించే విధంగా బాధ్యతలను అప్పగించాలని గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.
త్వరలో బహిరంగ సభ..
ఇక ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో ఓ భారీ బహిరంగ సభ నిర్వహించిన కేసీఆర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మరో సభ నిర్వహించే అవకాశం ఉంది. మొదటి సభలోనే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరో సభ పెట్టుకుందామని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. దీంతో కేసీఆర్ హాజరయ్యే విధంగా మరో భారీ బహిరంగ సభను ప్లాన్ చేసే యోచనలో టీఆర్‌ఎస్ ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి మునుగోడు విషయంలో టీఆర్‌ఎస్ ప్లాన్ మారినట్టు కనిపిస్తోంది.
[…] Also Read: KCR- Munugode By Election 2022: మునుగోడుపై కేసీఆర్ భారీ… […]