KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కొన్ని తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇప్పటి వరకు మూడు జిల్లాల్లో పర్యటించారు. ఈ సంరద్భంగా బహిరంగా సభలు నిర్వహించారు. ఈ సభల్లో ఎక్కడా భారతీయ జనతా పార్టీ ప్రస్తావన తీసుకు రాలేదు. శుక్రవారం మంచిర్యాల జిల్లాలో మాట్లాడుతూ ‘ప్రధాని నరేంద్రమోదీగారు’ అంటూ గౌరవంగా సంబోధించారు. కాంగ్రెస్‌ను బంగాళా ఖాతంలో కలుపుదాం అని పిలుపునిస్తున్నారు కానీ… బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు.
బీజేపీ నేతల్లో టెన్షన్..
ఒక్కసారిగా మారిన కేసీఆర్ వైఖరి తెలంగాణ బీజేపీ నేతలను టెన్షన్ పెడుతోంది. కేసీఆర్ ఏదో కుట్ర చేస్తున్నారని గొణుక్కుంటున్నారు. కానీ పైకి ఏమీ అనలేని పరిస్థితి. తెలంగాణలో బీజేపీకి బాగా హైప్ రావడానికి ప్రధాన కారణం కేసీఆర్. అదే పనిగా టార్గెట్ చేసి తెలంగాణలో బీజేపీనే ప్రధాన ప్రత్యర్థి అనే భావన ఎక్కువ ఎక్కువగా పంపించారు. ఉపఎన్నికల్లో.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ బీజేపీనే టార్గెట్ చేశారు. ఫలితంగా బీజేపీ.. బీఆర్‌ఎస్ మధ్య పోటీ జరుగుతున్న వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ మూడో పక్షంగా మారిపోయింది. రెండు పార్టీలు హోరాహోరీ తలపడుతూంటే.. కాంగ్రెస్‌ను ఎవరూ పట్టించుకోలేదు. అందుకే బీజేపీ ఎదుగుదలలో కేసీఆర్ పాత్ర ఉందని చెబుతూ ఉంటారు.
మారిన సీన్..
ప్రస్తుతం తెలంగాణలో పొలిటికల్ సీన్ మారింది. బీజేపీపై యుద్ధం ప్రకటించి హఠాత్తుగా ఎందుకు అస్త్ర సన్యాసం చేశారు. బీజేపీని విమర్శించడం లేదు. ఆ పార్టీని పల్తెత్తు మాట అనడం లేదు. ఓ వైపు బీజేపీతో బీఆర్‌ఎస్ లోపాయికారీ ఒప్పందాలని ప్రచారం.. మరో వైపు బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటేనని కాంగ్రెస్ విమర్శలు చేస్తూండటంతో చేరికలు కూడా లేకుండా పోయింది. కారణం ఏదైనా కేసీఆర్‌కు పోయేదేమీ లేదు. కానీ బీజేపీకి మాత్రం ఇప్పటి వరకూ వచ్చిన హైప్ అంతా కరిగిపోతోంది.
అంతుచిక్కని కేసీఆర్ వ్యూహం..
మొన్నటి వరకు బీజేపీని బంగాళాఖాతంలో కలుపుదాం అని పిలుపునిచ్చిన కేసీఆర్.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీని పట్టించుకోవడంలేదు. ఇప్పుడు దృష్టి మొత్తం కాంగ్రెస్‌పై పెట్టినట్లు కనిపిస్తోంది. కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో చిక్కుకోవడం, త్వరలో అరెస్ట్ ఉండే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలోనే కేసీఆర్ బీజేపీతో రాయబేరానికి వెళ్లినట్లు తెలుస్తోంది. బీజేపీ కవితను అరెస్ట్ చేయడం కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని తెలియడంతో.. కేసీఆర్ కాళ్లబేరానికి వెళ్లారని సమాచారం. ఈ క్రమంలోనే బీజేపీపై విమర్శలు చేయడం లేదని తెలుస్తోంది. తానే కాదు. తన కొడుకు కేటీఆర్, కూతురు కవితతో కూడా కేంద్రాన్ని పల్లెత్తు మాట అనొద్దని ఆదేశించారని తెలుస్తోంది. మరోవైపు బీజేపీని తెలంగాణలో బలహీన పర్చేందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌కు హైప్ తెస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే బీజేపీని విమర్శించకుండా కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ వ్యూహం ఎంటో అటు బీఆర్‌ఎస్ నేతలకే అంతు చిక్కడం లేదు.