Big Shock to YCP: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. అటు యువగళం పాదయాత్రతో పూర్వ వైభవానికి లోకేష్ కృషిచేస్తున్నారు. వయసు లెక్క చేయకుండా చంద్రబాబు సైతం రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తు వస్తున్నారు. మరోవైపు పొత్తుల వ్యూహాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గాన్ని జగన్ నుంచి దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలను సైకిలెక్కించే పనిలో పడ్డారు. లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో అడుగుపెడుతున్న వేళ ముగ్గురు నాయకులు టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ వైసీపీ నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వీరు ముగ్గురు బలమైన నేతలు కావడం, అందులోనూ రెడ్డి సామాజికవర్గ నేతలే కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వారిని ఆకర్షించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో వారు కూడా పార్టీలో చేరి నాయకత్వాలను బలోపేతం చేసుకునే పనిలో ఉన్నారు.
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చంద్రబాబుతో చర్చలు జరిపారు. పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. నెల్లూరు సిటీలో కానీ.. ఆత్మకూరు అసెంబ్లీ స్థానంలో కానీ పోటీచేసేందుకు ఆలోచిస్తున్నట్టు సమాచారం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వద్దకు స్వయంగా టీడీపీ సీనియర్ నేతలు బీద రవిచంద్ర, మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి వెళ్లి చర్చలు జరిపారు. ఆయనను టీడీపీలోకి ఆహ్వానించారు. మేకపాటి చంద్రశేఖరరెడ్డి కూడా స్వయంగా నారా లోకేష్ పాదయాత్ర వద్దకు చేరుకున్నారు.టీడీపీలో చేరికకు ఆయన కూడా మొగ్గు చూపారని తెలుస్తోంది. లోకేష్ సైతం సాదరంగా ఆహ్వానించినట్టు సమాచారం.
ప్రస్తుతం నారా లోకేష్ పాదయాత్ర కడప జిల్లా బద్వేలులో జరుగుతోంది. జూన్ 13 నుంచి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు ఒకేసారి కండువా కప్పాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు ఆ పార్టీకి పెట్టని కోట. గత ఎన్నికల్లో స్వీప్ చేసింది. అక్కడ పాగా వేయాలన్నది చంద్రబాబు ప్లాన్. వైసీపీకి స్వీట్ షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో టీడీపీ పావులు కదుపుతోంది. ముగ్గురు వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని జగన్ కు దిమ్మతిరిగే షాకివ్వాలని భావిస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More