
కేసీఆర్.. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సీఎం. కేసీఆరే లేకుంటే.. ఉద్యమాన్ని లేపకుంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యేది కాదనడంలో ఎంతవరకూ సందేహం లేదు. ఉద్యమాన్ని ఉవ్వెత్తునకు తీసుకెళ్లారు. ప్రత్యేక రాష్ట్రం సాధించే దాకా కొట్లాడారు. అభిమానుల మెప్పుపొంది రెండు సార్లు రాష్ట్రానికి సీఎం అయ్యారు.
రాష్ట్రానికి సీఎం కావడం అంటే ఎంతో రాజకీయ చతురత ఉండాలి. అంతకుమించి మైండ్‌గేమ్ ప్లాన్ తెలిసి ఉండాలి. వీటిలో ఎవరైనా కేసీఆర్ తర్వాతే అని చెప్పాలి. ఆయన ఒక్కసారి మైక్ పట్టారంటే ఆ స్పీచ్ వినేందుకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. పక్క రాష్ట్రం ఏపీలోనూ కేసీఆర్‌కు అభిమానులు ఉన్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు సంధించాలన్నా.. వారి ఎత్తులు తిప్పకొట్టాలన్నా అది కేసీఆర్‌తోనే అవుతుంది.
ఏటా ఎలక్షన్లు వస్తున్నాయంటే కేసీఆర్ తనదైన స్టైల్‌లో ప్రజలను మభ్యపెడుతుంటారు. పోయిన అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు కూడా ప్రచారానికి వెళ్లిన ప్రతీచోట.. తాను సర్వే చేయించానని.. వంద సీట్లు మనవేనని.. టీఆర్‌ఎస్‌కు తిరుగులేదని చెబుతుంటారు. దాని ప్రకారమే టీఆర్ఎస్ సైన్యం కూడా ప్రచారం ప్రారంభిస్తుంటుంది. చివరగా అటూఇటుగా ఫలితాలు రానే వస్తాయి. దీంతో కేసీఆర్ మాటకు తిరుగులేదనేది మరోసారి నిరుపితమవుతుంది. అలాంటి వ్యూహమే ఆది నుంచి కేసీఆర్ అమలు చేస్తున్నారు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలకు టైం వచ్చింది.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన కేసీఆర్.. గ్రేటర్ ఎన్నికలపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తాము సర్వే చేయించామని.. వంద సీట్లకు అటు ఇటూగా వస్తాయని స్పష్టం చేశారు. కొంత మంది ఏదేదో ప్రచారం చేస్తున్నారని.. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందన్నారు. అదే సమయంలో.. గ్రేటర్‌లో బీజేపీకి అనుకూలంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఒకటో.. రెండో కార్పొరేట్ సీట్లు పెరిగే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఉన్న సీట్లు పోతాయని చెప్పారు.
వాస్తవానికి గత బల్దియా ఎన్నికల్లో టీఆర్‌ఎస్ స్వీప్ చేసింది. టీడీపీ ఒకటి, కాంగ్రెస్ ఐదు వచ్చాయి. టీఆర్‌ఎస్ చెప్పినట్లుగానే 99 సీట్లు సాధించింది. ఈ సారి కూడా అదే స్థాయిలో ఫలితాలు సాధిస్తామన్న నమ్మకంతో ఉంది. అయితే.. ఈసారి కరోనా పరిస్థితులు.. తదితర కారణాలతో ప్రజల్లో కేసీఆర్ ప్రభుత్వంపై అంతోఇంతో మైనస్ ఏర్పడింది. వీటన్నింటినీ కప్పిపుచ్చుకునేందుకే ఇదంతా మైండ్ గేమంటూ ప్రతిపక్షాలూ విమర్శిస్తున్నాయి. ఒకప్పుడు చెప్పినట్లుగా ఇప్పుడు రిజల్ట్స్ రావని అంటున్నాయి. త్వరలోనే జరగనున్న బల్దియా ఎన్నికల్లో ఎవరి పైచేయి నిలుస్తుందో చూద్దాం..!