దుబ్బాకలో జరిగిన ఎదురు దెబ్బతో తేరుకున్న కేసీఆర్ ఇకపై అలాంటి పొరపాట్లు చేయకుండా ఉండేందుకు జాగ్రత్తలు పాటిస్తున్నారు. దీంతో మంత్రులను రంగంలోకి దింపి నియోజకవర్గాన్ని జల్లెడ పడుతున్నారు. ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల బాగోగులు పట్టించుకుంటున్నారు. వారి సమస్యలు ఎక్కడిక్కడ పరిష్కరిస్తూ వారిలో నమ్మకాన్ని కలగజేసేందుకు ముందుకు వెళ్తున్నారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హుజురాబాద్ నియోజకవర్గంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి పర్యటించారు. సీఎం కేసీఆర్ పేదలకు అండగా ఉంటారని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు అవసరమైన సంక్షేమ పథకాలు చేపడుతూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు ఇంటికి వచ్చే విధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. కరోనా కాలంలో కూడా సంక్షేమ పథకాల అమలు చేయడం రాష్ర్ట ప్రత్యేకతగా అభివర్ణించారు.
హుజురాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని గుర్తు చేశారు. ఏ పార్టీకి రాని మెజార్టీ టీఆర్ఎస్ కు వస్తుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ విధానాలే రాష్ర్టాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నాయని వివరించారు.ఈటల రాజేందర్ ఓటమి ఖాయమని చెప్పారు.