ఏడారిలో కూడా నీళ్లు పడుతాయని నమ్మించగల చాణక్యం కేసీఆర్ సొంతం.. వరంగల్ లో కెనడా వైద్యాన్ని తలదన్నేలా వైద్య సదుపాయాలు కల్పిస్తానని ప్రజలకు చుక్కుల చూపడం కేసీఆర్ స్టైల్. అసలు కేసీఆర్ అంటే మాటల మరాఠీ. ఆయన రాజకీయ చాణక్యం.. చురుకుదనం.. రాజకీయాల్లో ఎవరికి సాధ్యం కాదు. తాజాగా కేసీఆర్ వేసిన బుట్టలో కాంగ్రెస్ నాయకులు అడ్డంగా పడిపోయారు.
రాజకీయంగా కేసీఆర్ వేసే వ్యూహంతో తలపండిన నాయకులు సైతం కిందామీదా పడుతుంటారు. కొందరు మాత్రం ముందే గ్రహించి జాగ్రత్తపడ్డారు. తాజాగా కాంగ్రెస్ నాయకులను కేసీఆర్ పప్పులో కాలు వేసేలా చేశాడని తెలుసుకోలేకపోయారు. సమస్యలపై సహవాసం అయినా సరే పార్టీల పరంగా కాంగ్రెస్ నేతలను కేసీఆర్ దెబ్బకొట్టినట్లయింది. తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ అంతంతమాత్రాన.. ముందుకు సాగుతుంటూ తాజాగా ఆ పార్టీ నాయకుల తీరుతో ప్రజల్లో మరింత చులకన అయ్యేలా కనిపిస్తోంది. అందుకే బీజేపీ బలపడుతోంది. తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్ నాయకులు పరోక్షంగా బలం పెంచారని రాష్ట్రంలో తీవ్రంగా చర్చించుకుంటున్నారు.
యాదాద్రి జిల్లాకు చెందిన మరియమ్మ పోలీస్ లాకప్ డెత్ తోనే మరణించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు మొదటి నుంచి మరియమ్మ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలిసి పరిస్థితిని వివరించారు. కాంగ్రెస్ నేతలు ముందుగా గవర్నర్ ను కలిశారు. ఇష్యూ వివాదం కావడంతో కేసీఆర్ చక్రం తిప్పారు. తనను కలవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కబురు పంపారు. కానీ ఇక్కడే తమ ప్రత్యర్థి కేసీఆర్ బుట్టలో కాంగ్రెస్ నేతలుపడ్డారు. సీఎంను కలిసి విన్నవించాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు. సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వడం వారు కలవడం జరిగిపోయింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్ తన ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ ను దెబ్బకొడుతున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ నాయకులను టీఆర్ఎస్ లోకి చేర్చుకొని నామరూపాల్లేకుండా చేశారు. ఈ తరుణంలో కొద్దో గొప్పో ఉన్న నాయకులు అప్పుడప్పుడు ప్రభత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. కానీ గత దుబ్బాక ఉప ఎన్నిక నుంచి కాంగ్రెస్ పరిస్థితి దిగజారడంతో బీజేపీ బలం పుంజుకుంటోంది. బీజేపీకి ప్రత్యామ్మాయంగా కాంగ్రెస్ ను లేపాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. అందుకే కాంగ్రెస్ నేతలను ఏరికోరి పిలిపించుకొని వారికి మైలేజ్ పెంచారు. కానీ ఈ విషయం తెలియని కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ బుట్టలో పడిపోయారు. మరియమ్మ లాకప్ డెత్ క్రెడిట్ మొత్తం కేసీఆర్ కు పోగా.. కాంగ్రెస్ నేతలకు రిక్తహస్తమే మిగిలింది. త్వరలో హూజురాబాద్ ఉప ఎన్నిక జరగనుంది. అక్కడ మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలో ఉన్న విషయం తెలిసిందే. రాజకీయంగా లబ్ధి చేకూరడానికే కేసీఆర్ ఈ ఎత్తుగడ వేసినట్లు రాజకీయంగా ప్రచారం సాగుతోంది.
ఈ తరుణంలో కాంగ్రెస్ నాయకులు సీఎంను కలవడం చర్చనీయాంశంగా మారింది. ముందువెనకా ఆలోచించకుండా సీఎం అపాయింట్ మెంట్ అనగానే ఒకరి వెంట ఒకరు వెళ్లారు. కారణం మరియమ్మ కుటుంబ సభ్యుల కోసమేనైనా ప్రజల్లో మాత్రం ఇదంతా కేసీఆర్ చేశాడని ఫోకస్ అయ్యింది. దీంతో కాంగ్రెస్ నేతల శ్రమ బూడిదలో పోసిన పన్నీరైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ఓట్లు టీఆర్ఎస్ కు బదలాయించడం కోసమే కేసీఆర్ ను కలిశారని విమర్శలు చేశారు. దీంతో హుజూరాబాద్ లో ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి బరిలో ఉన్నా ప్రజలు పెద్దగా ఫోకస్ పెట్టే అవకాశం లేదని అంటున్నారు. ఇక టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగానే పోరు కొనసాగుతుందని అంటున్నారు.