
తెలంగాణలో లాక్ డౌన్ పై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ ను మరింత పటిష్టంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వరంగల్ అర్బన్ కలెక్టర్ కార్యాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. లాక్ డౌన్ ఈనెల 30వరకు ఉంటుందని.. మరింత కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు.
ఇక తెలంగాణలో అనుమతి పత్రాలు లేకుండా బయట తిరిగే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. అవసరం లేకపోయినా బయటకు రావద్దని సీఎం ప్రజలను హెచ్చరించారు. లాక్ డౌన్ వల్ల కరోనా చాలా వరకు నియంత్రణలోకి వచ్చిందని సీఎం తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని లాక్ డౌన్ విధించామని.. వైరస్ కట్టడికి ప్రజలంతా సహకరించాలని సూచించారు.
కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ సరిగా అమలు చేయకపోవడంపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారని.. కానీ నగరాలు, పట్టణాల్లో మరింత సమర్థంగా అమలు కావాలని సూచించారు.
ఇక రైతులు , ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులు లాక్ డౌన్ లో ఇబ్బందులు పడకుండా 10 రోజుల్లోనే ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని సూచించారు. ఇక వరంగల్ జైలును తరలించి జైలు 73 ఎకరాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.