కరోనాపై పోరులో ప్రజాఐక్యతను చాటేలా దీపాలు వెలిగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. మోడీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిముషాలపాటు రాష్ట్ర ప్రజలంతా దీపాలు వెలిగించాలని ఆయన కోరారు. మానవాళి మనుగడకు సవాల్ గా మారిన కరోనాపై చేస్తోన్న మహా పోరాటం స్ఫూర్తిమంతంగా సాగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
గత నెల 27 నాటికి రాష్ట్రంలో మొత్తం కేసులు 59 ఉండగా.. శుక్రవారం ఒక్కరోజే 75 మందిలో వైరస్ సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ వచ్చిన బాధితుల సంఖ్య 229కి చేరుకుంది. మహమ్మారి కోరలకు చిక్కి శుక్రవారం మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 11కు పెరిగింది.ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనా వైరస్‌తో 186 మంది చికిత్స పొందుతున్నారు.