తెలంగాణలో రాజకీయాల్లో మార్పులు వస్తున్నాయి. రోజురోజుకు టీఆర్ఎస్ చరిష్మా తగ్గుతోంది. వరుస ఓటములతో కుదేలయిపోతోంది. దీంతో కేసీఆర్ రగిలిపోతున్నారు. బీజేపీని టార్గెట్ చేస్తూ నిందిస్తున్నారు. ఆడలేక మద్దెల ఓడు అనే సామెతను నిజం చేస్తూ తన చేతగాని తనానికి బీజేపీని బలి చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల హుజురాబాద్ లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన హుజురాబాద్ ఓటమి పార్టీని అగాధంలో పడేసింది. దీంతో ఏం చేయాలో తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.
తెలంగాణలో బీజేపీ ప్రతిష్ట కూడా రోజురోజుకు పెరుగుతోంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని పదేపదే చెబుతున్న బీజేపీ నేతల మాటలకు టీఆర్ఎస్ నాయకుల్లో భయం పట్టుకుంది. కాంగ్రెస్ తో ఎలాగూ సమస్య లేకపోయినా బీజేపీ మాత్రం పక్కలో బల్లెంలా మారుతోంది. ఈ నేపథ్యంలో చాపకింద నీరులా వస్తున్న బీజేపీని అణగదొక్కాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు.
మరోవైపు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ని టార్గెట్ చేసుకుని రెచ్చిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ర్టంలో బీజేపీని ఎదగనీయకుండా చేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఇలా మాట్లాడుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రెస్ మీట్ లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కూడా కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కేసీఆర్ చరిష్మా తగ్గిపోతోందని సర్వేలు సైతం వెల్లడిస్తున్నాయి. దీంతో ఆయనలో కోపం పెరిగిపోతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ టీఆర్ఎస్ కు ప్రధాన పోటీగా నిలవడంతో భయం పట్టుకుంది. భవిష్యత్తులో టీఆర్ఎస్ కు అధికారం దక్కకుండా చేస్తుందనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఇలా చేస్తున్నారని తెలుస్తోంది. ఆయనలో వస్తున్న కోపం చూస్తుంటే బీజేపీపై ఆరోపణలు చేయడానికే నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో బీజేపీ నేతలు కూడా టీఆర్ఎస్ నే ప్రధానంగా టార్గెట్ చేసుకుని రాష్ర్టంలో అధికారం చేపట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
