‘‘కేసీఆర్ కనీసం సచివాలయానికి కూడా రావట్లేదు.. ఫామ్ హౌస్ రాజకీయాలు చేస్తున్నారు.’’ విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించేవి. అయినా.. ఈ విమర్శలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయేవారు గులాబీ దళపతి. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కొంతకాలంగా కేసీఆర్ జనాల్లోనే తిరుగుతున్నారు. ఈ ఊరూ.. ఈ ఊరూ.. అంటూ పర్యటనలు చేస్తున్నారు. జనాలతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా.. ప్రగతి భవన్ టూ ఫామ్ హౌస్ పద్ధతిలో సాగే కేసీఆర్ రాజకీయం జనాల్లోకి మళ్లింది.
గతంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. నిర్వహణ బాధ్యతను అటు కేటీఆర్ కో, ఇటు హరీష్ రావుకో అప్పగించేవారు. కానీ.. ఇప్పుడు స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగారు. హుజూరాబాద్ లో ఈటలను ఓడించాలంటే తానే స్వయంగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారేమోగానీ.. వరుసగా పర్యటనలు చేస్తున్నారు. పథకాలు ప్రకటిస్తున్నారు. జనాల్లో కలిసిపోయే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే.. కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఏర్పాటు చేస్తున్న సమావేశాలు కేవలం.. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే కాదని, భవిష్యత్ ను దృష్టిలోపెట్టుకొనే జనాల్లోకి వచ్చాడని అంటున్నారు. దళితబంధును ప్రతిష్టాత్మకంగా ప్రకటించినా.. అది బూమరాంగ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో.. దాన్ని ఎదుర్కోవడానికి కేసీఆర్ రంగంలోకి దిగారు. జనాలకు సర్దిచెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇటు పార్టీ పరంగా కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉన్నట్టుండి టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. హుజూరాబాద్ ఎన్నిక ముందు రాష్ట్ర కార్యవర్గ సమావేశం.. అది కూడా ఉన్నఫలంగా నిర్వహించాల్సిన అవసరం ఏంటన్నది ఎవ్వరికీ బోధపడట్లేదు. ఇవన్నీ చూస్తున్నవారు.. కేసీఆర్ లో ఒకవిధమైన టెన్షన్ మొదలైందని, అందుకే ప్రశాంతంగా ఫామ్ హౌజ్ లో, ప్రగతి భవన్ లో ఉండలేకపోతున్నారని చెబుతున్నారు.
దీనికి ప్రధాన కారణం.. విపక్షాలు బలపడడమేనని అంటున్నారు. ఏడాది కాలంగా బీజేపీ జోరు పెంచింది. కాంగ్రెస్ కూడా రేవంత్ రాకతో టాప్ గేర్ వేసింది. పైగా.. టీఆర్ ఎస్ ఇప్పటికే రెండు సార్లు అధికారంలో ఉంది. కాబట్టి.. సహజ వ్యతిరేక అనివార్యంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని హ్యాట్రిక్ సాధించడం అంత తేలిక కాదు. అందుకే.. కేసీఆర్ బయటకు వచ్చారని, అసెంబ్లీ ఎన్నికల వరకూ ఈ పరిస్థితి కొనసాగించొచ్చని అభిప్రాయ పడుతున్నారు. మొత్తానికి.. కేసీఆర్ ను జనాల్లోకి రప్పించింది రేవంత్ రెడ్డి, బండి సంజయేనని అంటున్నారు.