
KCR Vs Modi : ‘నరేంద్రమోదీ.. నీ అరాచకాలు ఇక సాగయ్.. నిన్ను గద్దెదించే వరకూ కొట్టాడుతా.. బీజేపీని బంగాళాఖాంతంలో కలుపుతం.. నువ్వు గోకినా గోకకున్నా.. నేను నిన్ను గోకుత’ ఏడాది క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్న మాటలివీ. అదే పనిగా మోదీని ధూషించడం, కేంద్రంపై విమర్శలు చేయడం, కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతోందని సెంటిమెంటు రగిల్చే ప్రయత్నం చేస్తూ వచ్చారు. కేంద్రంతో ఢీ అంటే ఢీ అన్నట్లుగానే ఎదురుదాడి చేస్తూ వస్తున్నారు. మీకు ఈడీ, సీబీఐ ఉంటే.. నాకు సిట్ ఉంది అన్నట్లుగా దర్యాప్తు సంస్థల విషయంలోనూ పోటీ పడ్డాడు కేసీఆర్. కానీ శనివారం అదే నరేంద్రమోదీ తెలంగాణకు వచ్చాడు. హైదరాబాద్ నడిబొడ్డున నిలబడి. తెలంగాణ ప్రజలతోనే అవినీతి ప్రభుత్వంపై చర్య తీసుకోవాలా వద్దా? కుటుంబ పాలనను సాగనంపుదామా వద్దా? అని ప్రశ్నించ సమాధానం రాబట్టారు. తండ్రి, కొడుకు, కూతురు చేతిలోనే అధికారం ఉందని కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా విమర్శించారు. ఇంత చేసినా కేసీఆర్ మాత్రం నోరు మెదపడంలేదు. బీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలంతా మోదీపై విమర్శలతో విరుచుకుపడినా కల్వకుంట్ల కుంటుంబం మాత్రం సైలెంట్‌గానే ఉంది.
నిశ్శబ్దం వెనుక ఆంతర్యం ఏమిటి?
తెలంగాణ గడ్డపై నిలబడి తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపుతామని మోదీ హెచ్చరించినా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ముఖ్యమైన మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి తనయ, కల్వకుంట్ల కవిత మాత్రం నోరు మెదపడం లేదు. కనీసం మోదీ వ్యాఖ్యలను ఖండించడం లేదు. మోదీ పరోక్షంగా హెచ్చరించినా కేసీఆర్ సైలెంట్‌గా ఉండడానికి కారణం ఏంటని తెలంగాణ అంతా తల బద్దలు కొట్టుకుంటోంది. కేంద్రం ఏమీ అనకున్నా. బీజేపీపై, మోదీపై గతంలో విరుచుకుపడిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారన్న చర్చ జరుగుతోంది.
బీఆర్‌ఎస్ నేతల ఎదురుదాడి..
నిజానికి మోదీ సభలో కేసీఆర్ కూడా పాల్గొనాల్సి ఉంది. ఆయన పాల్గొంటే ప్రధాని మోదీ ఇలాంటి ఆరోపణలు చేసేవారో లేదో తెలియదు కానీ.. ఆయన రాలేదు కాబట్టి మోదీ స్వేచ్ఛగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. నరేంద్రమోదీ విమర్శలపై బీఆర్‌ఎస్ పార్టీ నేతలు వెంటనే స్పందించారు. హరీశ్‌రావు దగ్గర్నుంచి కింది స్థాయి ఎమ్మెల్యే వరకూ స్పందించారు. అయితే ఎవీరు ఎవరు స్పందించినా పెద్దగా లెక్కలోకి రాదు. కేవలం.. కేసీఆర్ స్పందిస్తేనే హాట్ టాపిక్ అవుతుంది.

గతంలో వాళ్లు వెళ్లగానే ప్రెస్‌మీట్..
గతంలో అమిత్‌షా లేదా ప్రధానమంత్రి వచ్చిన పోయిన తర్వాత వెంటనే కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి వారు చేసిన ఆరోపణల్ని ఖండించేవారు కేసీఆర్. బీజేపీతో పూర్తిగా శత్రుత్వం వచ్చిన తర్వాత అసలు వెనక్కి తగ్గడం లేదు. గతంలో మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారని తెలిసిన తర్వాత కనీసం మూడు నాలుగు ప్రెస్ మీట్లు పెట్టారు. అయితే ఇప్పుడు మాత్రం కేసీఆర్ ప్రెస్ మీట్లకు దూరంగా ఉన్నారు. ఇటీవల మహారాష్ట్ర నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరే సమయంలో మోదీని విమర్శించే సమయానికి వీడియో కెమెరాలను ఆఫ్ చేయించారు. దీంతో కేసీఆర్‌లో భయం మొదలైందా అన్న సందేహాలు వ్యక్తముతున్నాయి. ఒకవైపు లిక్కర్ స్కాంలో కూతురు కవిత, మరోవైపు లీకేజీ స్కాంలో కొడుకు కేటీఆర్ ఇరుక్కుపోవడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో కేంద్రంతో, మోదీతో గొడవ ఎందుకు అని కేసీఆర్ సైలెంట్ ఆయ్యారని తెలుస్తోంది.
మోదీ చేసినవి చిన్న విమర్శలేం కాదు.. అవినీతి ఆరోపణలు చేశారు. అభివృద్ధి చేయడం లేదన్నారు. వీటికి కేసీఆర్ స్థాయి నేత కౌంటర్ ఇవ్వకపోతే బీఆర్‌ఎస్ వాయిస్ గట్టిగా ప్రజల్లోకి వెళ్లదన్న వాదన వినిపిస్తుంది. అయినా కేసీఆర్ ఎందుకు సైలెంట్‌గా ఉండడం ఎవరికీ అంతుపట్టడం లేదు. దీని వెనుక ఏదైనా వైలెంట్ నిర్ణయం ఉంటుందా అన్నచర్చ కూడా జరుగుతోంది.