KCR vs Modi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలను తనకు అనుకూలంగా, కేంద్రంపై పోరుకు వేదికగా మార్చుకోవాలని భావిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు. పార్లమెంట్ వేదికగానే బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు కేసీఆర్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.

కేంద్రం, మోదీ టార్గెట్‌గా..
బీజేపీ హఠావో.. దేశ్ బచావో నినాదంతో కేంద్రంపై, ప్రధాని మోదీపై యుద్ధం చేస్తోన్న సీఎం కేసీఆర్ ఆ పోరును మరింత ఉ«ధృతం చేయాలని భావిస్తున్నారు. అందుకు వర్షాకాల పార్లమెంట్ సమావేశాలే అనుకూలమని అనుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సమరశంఖం పూరించేందుకు సిద్ధమవుతున్నారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్న కేంద్రం వైఖరిని తేటతెల్లం చేయాలనుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వ అప్రజాస్వామిక దమన నీతిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకూ సమాయత్తమవుతున్నారు.
ఆ ముఖ్యమంత్రులు కలిసొస్తారా..?
బీజేపీపై పోరులో భాగంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలతో ఫోన్లో సీఎం కేసీఆర్ మంతనాలు జరిపారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, బీహార్ ప్రతిపక్ష నేత, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఎస్పీ అధినేత అఖిలేశ్‌యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తోపాటు ఇతర జాతీయ విపక్ష నేతలతో చర్చలు జరిపారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆస్పత్రిలో ఉన్నందున ఆయన సన్నిహితులతో మాట్లాడారు. కేంద్రంపై కేసీఆర్ చేసే సమరానికి వీరు ఏమేరకు మద్దతు ఇస్తారన్నది సందేహమే? మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీజేపీ, కేంద్ర విధానాలను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నవారే. కేసీఆర్ మొదటి ఐదేళ్లు అనుకూలంగా ఉండి. తర్వాత వ్యతిరేకిగా మారారు. దీంతో కేసీఆర్‌ను ఆయా ముఖ్యమంత్రులు అంతగా విశ్వసించడం లేదు. కానీ విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలు, విపక్ష నేతలు సానుకూలంగా స్పందిస్తున్నట్లు ప్రగతి భవన్ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఎంపీలకు దిశానిర్దేశం..
పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి, కేంద్ర సర్కారు విధానాలను ఎలా ఎండగట్టాలో.. పార్లమెంటు వేదికగా కేంద్రంపై ఎలా పోరాడాలి అనే విషయాలపై టీఆర్‌ఎస్ ఎంపీలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇందుకు శనివారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, ధాన్యాన్ని కొనకుండా రైతులను, మిల్లర్లను, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న తీరుపై పోరాడాలని ఎంపీలకు కేసీఆర్ పిలుపు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఉపాధి హామీ పథకం అమల్లో ద్వంద్వ వైఖరిని నిలదీయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రూపాయి పతనంతోపాటు ఆర్థిక రంగంలో కేంద్రం అసంబద్ధ విధానాలపై పార్లమెంటులో నిలదీయాలని నిర్ణయించినట్లు ప్రగతి భవన్ ప్రకటనలో తెలిపారు.